మంగళవారం స్పైస్ జెట్ విమానాలతోపాటు ఓ విస్తార ఎయిర్‌లైన్‌కు చెందిన విమనాంలోనూ సమస్యలు వచ్చాయి. బ్యాంకాక్ నుంచి ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఆ విమానం ల్యాండ్ అయిన తర్వాత ఇంజిన్ ఫెయిల్ అయింది. సింగిల్ ఇంజిన్‌తోనే పార్కింగ్ బే వైపు విమానాన్ని తీసుకెళ్లుతుండగా ఆ ఇంజిన్ కూడా ఫెయిల్ అయింది.
న్యూఢిల్లీ: మంగళవారం రోజు విమాన సమస్యలు వరుసపెట్టి చోటుచేసుకోవడం కలకలం రేపుతున్నాయి. నిన్న ఒక్క రోజే స్పైస్ జెట్‌కు సంబంధించిన మూడు విమానాల్లో పలు విధాల సమస్యలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అదే రోజు అంటే.. మంగళవారమే విస్తార ఎయిర్‌లైన్‌కు చెందిన విమానంలోనూ సమస్య తలెత్తినట్టు ఆలస్యంగా తేలింది. బ్యాంకాక్ నుంచి ఢిల్లీకి వచ్చిన విమానం ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండ్ అయింది. ల్యాండ్ అవ్వగానే ఇంజిన్‌లో సమస్య తలెత్తింది. ఒక ఇంజిన్ ఫెయిల్ అయింది. మరికాసేపట్లోనే మరో ఇంజిన్ కూడా ఫెయిల్ అయింది. అయితే ప్రయాణికులు అందరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు.
బ్యాంకాక్ నుంచి యూకే 122 ఫ్లైట్ ఢిల్లీకి వచ్చింది. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో నిన్న ల్యాండ్ అయింది. కానీ, సాంకేతిక సమస్యల కారణంగా రన్‌వేపై ల్యాండ్ అయిన తర్వాత ఒక ఇంజిన్ ఫెయిల్ అయింది. మరో ఇంజిన్ సహాయంతో ఆ విమానాన్ని ట్యాక్సింగ్ చేస్తుండగా.. ఆ ఇంజిన్ కూడా ఫెయిల్ అయిపోయింది. ట్యాక్సివే కే వద్దకు చేరుకున్న తర్వాత రెండో ఇంజిన్ కూడా ఫెయిల్ అయినట్టు అధికారులు తెలిపారు. దీంతో ఈ విషయాన్ని ఎయిర్ ట్రాాఫిక్ కంట్రోల్‌కు తెలియజేశారు. విమానాన్ని ట్రక్కు ద్వారా లాక్కుంటూ పార్కింగ్ బే వద్దకు తీసుకెళ్లారు.
ఢిల్లీలో తమ విమానం ల్యాండ్ అయిన తర్వాత పార్కింగ బే వద్దకు వెళ్లుతుండగా చిన్న ఎలక్ట్రికల్ మాల్‌ఫంక్షన్ జరిగిందని విస్తార ప్రతినిధి తెలిపారు. దీంతో ప్రయాణికుల క్షేమం దృష్టిలో పెట్టుకుని ట్రక్ ద్వారా టో చేసినట్టు విస్తార ఓ ప్రకటనలో పేర్కొంది.
