తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సారి సినీ గ్లామర్ మెరవనుంది. ఇప్పటికే రజనీకాంత్ పార్టీ పెడతానని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా మరో హీరో ఎన్నికల్లో పోటీ చేయనున్నాడు. 

సినీ కార్మికుల సమస్యలు, విపత్తుల సమయంలో సహాయ కార్యక్రమాల్లో ముందుండే హీరో విశాల్ వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. విశాల్‌ ఇదివరకే నిర్మాతల సంఘం, నడిగర్‌ సంఘం ఎన్నికల్లో పోటీ చేసి అధ్యక్షుడిగా గెలిచారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత పోటీ చేసిన ఆర్కే నగర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి నామినేషన్‌ వేశాడు. కానీ చివరి క్షణంలో నామినేషన్‌ను ప్రతిపాదించిన పదిమందిలో కొందరు మద్దతు ఉపసంహరించుకోవడంతో ఆ నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. దీంతో పోటీ చేయలేకపోయారు.

ఈ నేపథ్యంలో మళ్ళీ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నై పరిధిలోని ఏదైనా ఒక నియోజకవర్గంలో పోటీ చేయాలని విశాల్‌ నిర్ణయించినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ విషయమై విశాల్‌ తన అభిమాన సంఘాల నాయకులతో చర్చలు కూడా సాగిస్తున్నారు. త్వరలో విశాల్‌ ఏ నియోజకవర్గంలో పోటీ చేయనున్నారనే విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు.