ఫుడ్ డెలివరీ భాయ్ ఇంటిబయట విడిచివున్న షూస్ ను దొంగిలిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  దేశ రాజధాని న్యూడిల్లీలో జరిగిందీ విచిత్రమైన దొంగతనం.

న్యూడిల్లీ : ఫుడ్ డెలివరీ చేయడానికి వచ్చినవాడు దొంగతనానికి పాల్పడ్డాడు. ఇంటిబయట విడిచివున్న విలువైన షూస్ పై కన్నేసిన అతడు చాలా చాకచక్యంగా వాటిని ఎత్తుకెళ్లాడు. కానీ ఈ దొంగతనం దృశ్యాలన్నీ సిసి కెమెరాల్లో రికార్డ్ కావడంతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. దేశ రాజధాని డిల్లీ శివారులోని గురుగ్రామ్ లో జరిగిన ఈ షూస్ చోరి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

గురుగ్రామ్ లోని ఓ అపార్ట్ మెంట్ లో ఫుడ్ డెలివరీ చేయడానికి వెళ్లాడు స్విగ్గీ భాయ్. ఈ క్రమంలో ఓ ప్లాట్ ముందు విడిచివున్న విలువైన నైక్ షూస్ పై అతడు మనసు పారేసుకున్నాడు. అతడికి ఎంతలా నచ్చాయోగానీ వాటికోసం దొంగగా మారాడు. పక్కా ప్లాన్ తో ప్రొఫెషనల్ దొంగలా షూస్ దొంగిలించాడు. ఇలా ఎవరికంటా పడకుండా జాగ్రత్తపడ్డాడు కానీ సిసి కెమెరా కంటికి చిక్కి అడ్డంగా బుక్కయ్యాడు. 

సిసి కెమెరాలో రికార్డయిన వీడియోను పరిశీలిస్తే... ఫుడ్ డెలివరీ చేసి తిరిగి వెళుతున్న సమయంలో ఓ ప్లాట్ ముందు మంచి షూస్ వుండటాన్ని అతడు గమనించాడు. అప్పటికప్పుడు వాటిని దొంగిలించేందుకు ప్లాన్ చేసాడు. ఆ ఇంట్లో ఎవరైనా వున్నారేమోనని నిర్దారించుకునేందుకు డోర్ కొట్టాడు. ఎవరూ డోర్ తీయకపోవడంతో తన పనిని కానిచ్చేసాడు. ఎవరైనా వస్తున్నారేమోనని ముందూవెనక చూసుకుని తనవద్ద వున్న టవల్ లో షూస్ పెట్టుకుని ఎంచక్కా చెక్కేసాడు.

డెలివరీ భాయ్ దొంగతనం ఇలా బయటపడింది :

విలువైన షూస్ కనిపించకపోవడంతో సదరు ప్లాట్ లోని వారు ఇంటిబయట వున్న సిసి కెమెరా రికార్డ్ ను పరిశీలించారు. దీంతో స్విగ్గీ డెలివరీ భాయ్ షూస్ ను దొంగిలిస్తున్న ద‌ృశ్యాలు వారికంట పడ్డాయి. ఈ షూస్ చోరీ వీడియోను రోహిత్ అరోరా అనే వ్యక్తి ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. 'స్విగ్గీ డ్రాప్ ఆండ్ పికప్ సర్వీస్. డెలివరీ భాయ్ నా ఫ్రెండ్ నైక్ షూస్ దొంగిలించాడు. ముందుజాగ్రత్తగా అతడు తన మొబైల్ నంబర్ ఎక్కడా వాడలేదు'' అంటూ స్విగ్గీ సంస్థకు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసాడు. 

Scroll to load tweet…



స్విగ్గీ స్పందన : 

డెలివరీ భాయ్ షూస్ దొంగతనంపై స్విగ్గీ సంస్థ స్పందించింది. 'డెలివరీ భాగస్వాముల నుండి మంచి సర్వీస్ ను ఆశిస్తున్నాం' అంటూ ట్వీట్ చేసి చేతులు దులుపుకుంది. కానీ నెటిజన్లు మాత్రం విలువైన షూస్ ను కోల్పోయిన సదరు వ్యక్తికి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.