VIRAL VIDEO: పోలీస్ ఆఫీసర్‌కు నిరసన ‘హారతి’.. ఎందుకో తెలుసా?

VIRAL VIDEO: ఓ మహిళ తన  భర్త, కూతుర్లను తీసుకొని పోలీసు స్టేషన్ కు వచ్చారు. అక్కడ విధుల్లో ఉన్న పోలీస్ ఆఫీసర్ కు హారతి ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఆయన చేసిన గొప్పపనేంటి ? ఆమె అలా ఎందుకు హారతి ఇచ్చింది..

VIRAL VIDEO Couple Performs Police Aarti Over Inaction in Madhya Pradesh KRJ

VIRAL VIDEO: సాధారణంగా హారతి ఎవరికి ఇస్తారు ? ఇదేం ప్రశ్న.. హారతి దేవుళ్ల ఫొటోలకో లేక గుడికి వెళ్లినప్పుడు భగవంతుడి విగ్రహాలకు ఇస్తారని సమాధానం చెబుతారు కదా.. కానీ మధ్యప్రదేశ్ లోని రేవాలో మాత్రం ఓ విచిత్ర ఘటన జరిగింది. ఓ మహిళ తన భర్తతో కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లి అక్కడ డ్యూటీలో ఉన్న పోలీసు ఆఫీసర్ కు హారతి ఇచ్చింది. ఆయనేదో వాళ్లకు సాయం చేసి ఉంటారు.. అందుకే కృతజ్ఞతగా అలా హారతి ఇచ్చారని అనుకుంటే పొరపాటే. ఆమె ఆ పోలీసు ఆఫీసర్ తీరుకు నిరసనగా అలా చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

అది మధ్యప్రదేశ్ లోని రేవా పట్టణం. అక్కడ సిటీ కొత్వాలి పోలీస్ స్టేషన్ లో టీఐ జేపీ పటేల్ తన గదిలో కూర్చొని ఉన్నారు. ఆ గదిలోకి హఠాత్తుగా ఓ మహిళ తన భర్త, కూతుర్లను తీసుకొని వచ్చారు. భర్త చేతిలో పూల మాల, ఆమె చేతిలో హారతి పళ్లెం, పూజా సామాగ్రి ఉన్నాయి. లోపలికి ప్రవేశించగానే హారతి వెలించారు. ఆ ఆఫీసర్ కు హారతి ఇచ్చారు. ఏం జరుగుతుందో అర్థం కాని ఆ ఆఫీసర్.. తన కుర్చీలో నుంచి లేచారు. ఇవన్నీ వద్దని అంటున్నారు.  ఇదంతా వీరితో పాటు వచ్చిన మరొకరు వీడియో రికార్డు చేయడం ప్రారంభించారు.

అదే సమయంలో భర్త మీరు దీనికి అర్హులే అని చెబుతూ, మెడలో పూల దండ వేయబోయారు. కానీ దానిని తిరస్కరిస్తూ, కాస్త కోపంగా ఆయన అక్కడి నుంచి బయటకు వచ్చారు. అదే సమయంలో మహిళ భర్త హిందీలో.. కెమెరా వైపు చూస్తూ తన గోడు వెళ్లబోసుకున్నారు. తాము ఫిర్యాదు చేసి ఎంతో కాలం అయినా.. ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదని ఆయన వాపోయారు. కొంత సమయం తరువాత ఆ పోలీసు ఆఫీసర్ వీడియో రికార్డింగ్ ను ఆపేశారు. 

అసలేం జరిగిందంటే  ?

హారతి ఇచ్చిన మహిళ పేరు అనురాధ సోని. ఆమె భర్త పేరు కుల్ దీప్ సోని. అయితే ఆమె కొంత కాలం కిందట తనకు జరిగిన మోసంపై సిటీ కొత్వాలి స్టేషన్ లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే 26 రోజుల పాటు విచారణ జరుగుతున్నప్పటికీ పోలీసులు ఇంకా ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. ఈ విషయంలో ఎంత చెప్పినా పోలీసుల తీరు మార్చుకోలేదు. 

దీంతో విసిగెత్తిపోయిన ఆ దంపతులు ఇలా వినూత్నంగా హారతి ఇచ్చి నిరసన తెలిపారు. 26 రోజుల విచారణ జరుగుతున్నప్పటికీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో జాప్యం చేయడమే తాము ఇలా చేయడానికి కారణమని దంపతులు వీడియోలో స్పష్టం చేశారు. ప్రజా భద్రతకు భరోసా కల్పించడం, అవసరమైనప్పుడు తగిన చర్యలు తీసుకోవడం పోలీసు అధికారికి తమ కర్తవ్యాన్ని గుర్తు చేయడమే తమ ఉద్దేశమని చెప్పారు.  అయితే దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios