జంతువుల ప్రవర్తన ఒక్కొక్కసారి ఆశ్చర్యం కలిగిస్తుంటుంది. సాధారణంగా ఇంట్లో ఎవరైనా చనిపోతే.. బంధువుల, సన్నిహితులు, తెలిసిన వాళ్లు వచ్చి వారిని పరామర్శించి, ఓదార్చి వెళుతూ ఉంటారు.

అయితే ఓ కోతి మాత్రం చావింటికి వెళ్లి అక్కడి వారిని ఓదార్చి అందరిని ఆశ్చర్యపరిచింది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రం నార్గుండ్‌కు చెందిన ఓ 80 ఏళ్ల వృద్ధుడు శుక్రవారం మరణించాడు.

దీంతో అతని బంధువులంతా ఇంటికి వచ్చి కుటుంబసభ్యులను పరామర్శించి ఓదారుస్తున్నారు. సరిగ్గా ఈ సమయంలో ఓ కోతి అక్కడికి వచ్చి అక్కడ ఏడుస్తున్న ఓ మహిళ దగ్గరకు వెళ్లి భుజం మీద చేయి వేసి, తల నిమిరి ఓదార్చింది. దీంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు.

ఏకంగా హనుమాన్ జయంతి రోజే ఇలా జరిగిందంటే.. స్వయంగా ఆ హనుమంతుడే వచ్చి ఓదార్చడని ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. అయితే అదే కోతి గతంలో కూడా ఇలా కొందరి ఇళ్లకు వెళ్లి ఓదార్చిందని అక్కడి వారు చెబుతున్నారు.

ఎక్కడైనా గట్టిగా ఎవరైనా ఏడుస్తున్న శబ్ధం వినిపిస్తే చాలు ఈ కోతి అక్కడ తప్పక ప్రత్యక్షమవుతుందంటున్నారు స్థానికులు.  మనుషులు ఒకర్ని ఒకరు ఎలా ఓదార్చుకుంటారో.. ఈ వానరం కూడా అలాగే చేస్తుందని తెలిపారు.

గత కొన్ని నెలలుగా చావింటికి ఈ కోతి రావడం ఆనవాయితీగా మారిందంటున్నారు. ఒకవేళ వానరం రాకపోతే అంత్యక్రియలు పూర్తికానట్లేనని స్థానికులు భావిస్తున్నారు. కోతి ఓదార్పును కొందరు వీడియో తీసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.