Asianet News TeluguAsianet News Telugu

నా బిడ్డకు తండ్రి ఆయనే.. సంబంధం లేదన్న మంత్రి.. తమిళనాట ఆడియో కలకలం

అన్నాడీఎంకే సీనియర్ నేత, మత్స్య శాఖ మంత్రి జయకుమార్ వివాదంలో చిక్కుకున్నారు. ఓ యువతి, మహిళతో ఆయన మాట్లాడినట్లుగా బయటకొచ్చిన ఆడియో టేపులు తమిళనాడులో సంచలనం కలిగిస్తున్నాయి

viral audio: minister jayakumar in controversy
Author
Chennai, First Published Oct 23, 2018, 10:07 AM IST

అన్నాడీఎంకే సీనియర్ నేత, మత్స్య శాఖ మంత్రి జయకుమార్ వివాదంలో చిక్కుకున్నారు. ఓ యువతి, మహిళతో ఆయన మాట్లాడినట్లుగా బయటకొచ్చిన ఆడియో టేపులు తమిళనాడులో సంచలనం కలిగిస్తున్నాయి.

రెండు రకాలుగా ఉన్న ఆడియో టేపులో మంత్రికి ఓ యువతితో సంబంధం ఉన్నట్లు.. జయకుమార్ కారణంగా ఆమె గర్భం దాల్చినట్లు.. ఈ విషయం బయటకొస్తే పరువు పొతుందనే ఉద్దేశ్యంతో అబార్షన్ ప్రయత్నాలు జరగుతున్నట్లుగా మంత్రి జయకుమార్ ఆ యువతి తల్లితో మాట్లాడినట్లుగా ఉన్న సంభాషణలు వైరల్ అయ్యాయి.

మరో టేపులో ప్రస్తుతం ఆ యువతి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు... మంత్రిని తండ్రిగా పేర్కొంటూ.. బర్త్ సర్టిఫికెట్ సైతం పొందినట్టుగా సంభాషణలు ఉండటం రచ్చకు దారి తీసింది. ఆ గొంతు అచ్చుగుద్దినట్లు మంత్రి జయకుమార్‌లా ఉందని కొందరు.. ఆయన ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టారు.

గతంలో ఇటువంటి ఆరోపణల కారణంగా ఆయనపై నాటి ముఖ్యమంత్రి జయలలిత ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేశారు. దీంతో ఆ మంత్రి.. ఈ మంత్రి ఒక్కరేనంటూ ప్రచారం జరుగుతోంది. పరిస్థితి చేయిదాటుతుండటంతో మంత్రి జయకుమార్ నిన్న సాయంత్రం ఐదున్నర గంటల ప్రాంతంలో మీడియా ముందుకు వచ్చారు.

గతంలో తానెవరితోనో సన్నిహితంగా ఉన్నట్లుగా ఫోటోలను మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో బయటపెట్టారు. ఆ కేసులో అప్పట్లో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారని గుర్తు చేశారు. వాళ్లే తనపై మరోసారి కుట్ర పన్ని తన పరువు ప్రతిష్టలను దెబ్బకొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని జయకుమార్ స్పష్టం చేశారు.

అమ్మకు అత్యంత సన్నిహితుడినైన తనను శశికళ కుటుంబం టార్గెట్ చేసిందన్నారు. మన్నార్‌గుడి మాఫియా గతంలో తనకు వ్యతిరేకంగా పనిచేసిందని ఆరోపించారు. ఇప్పుడు కూడా మరో కుట్రలో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని... అయితే తాను ఇలాంటి వాటికి భయపడనని పేర్కొన్నారు. ఈ ఆడియోలోని గళం తనది కాదని.. దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేస్తానని.. కేసులు వేస్తానని చెప్పారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios