మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తమ సంతాపం వ్యక్తం చేశారు.    

దిల్లీ: మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తమ సంతాపం వ్యక్తం చేశారు.

వాజ్‌పేయీ మరణం దేశ ప్రజలకు తీరనిలోటు. అటల్‌ జీ లేరన్న వార్త నన్నెంతగానో కలచివేసింది. ఆయన మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను- రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

 అటల్‌ జీ లేరన్నది ఎంతో దుఖదాయకం. ఆయన ఇచ్చిన స్ఫూర్తి, ప్రేరణ, మార్గదర్శకత ప్రతి భారతీయుడికి అండగా ఉంటుంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఈశ్వరుణ్ని ప్రార్థిస్తున్నా- ప్రధాని నరేంద్రమోదీ

 దేశం గొప్ప నాయకుడిని కోల్పోయింది. వాజ్‌పేయి ప్రజల ఆదరాభిమానాలు, ప్రేమ చూరగొన్న నేత- కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ

వాజ్‌పేయి మరణంపై స్పందించేందుకు మాటలు రావట్లేదు. వాజ్‌పేయిసీనియర్‌ నాయకుడు మాత్రమే కాదు.. 64 ఏళ్లుగా మంచి మిత్రుడు. ఆర్‌ఎస్‌ఎస్‌లో ప్రచారక్‌గా చేరినప్పటి నుంచి వాజ్‌పేయితో అనుబంధం ఉంది- ఎల్‌.కె.అద్వాణీ, బీజేపీ అగ్రనేత

దేశం గొప్ప రాజనీతిజ్ఞుడిని కోల్పోయింది. భారత రాజకీయ బీష్ముడు వాజ్‌పేయి. ఉదారవాది, మానవతావాది, కవి, సిద్ధాంత కర్త, వక్త, అత్యుత్తమ పార్లమెంటేరియన్‌. ఒక్క ఓటుతో ప్రభుత్వం పడిపోయినా చలించని మేరునగధీరుడు- ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు