పశ్చిమ బెంగాల్‌లో నిరసన ప్రదర్శన రణరంగాన్ని తలపించింది. కొందరు బీజేపీ జెండాలు చేత పట్టుకుని ఓ పోలీసుపై తీవ్రంగా కొడుతున్న వీడియో వైరల్ అయింది. ఆ దాడిలో గాయపడ్డ పోలీసు అధికారి చేయి ఫ్రాక్చర్ అయినట్టు సమాచారం. 

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రణరంగాన్ని తలపించింది. బీజేపీ కొల్‌కతాలో తలపెట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణలు తీవ్రస్థాయిలో జరిగాయి. నడి రోడ్లపై రాళ్లు రువ్వడం, బాంబూ కట్టెలతో దాడి చేసుకోవడం, టార్గెట్ చేసుకుని దాడి చేయడం వంటివి చాలా చోట్ల కనిపించాయి. ఓ పోలీసు అధికారిపై నిరసనకారుల దాడి కలకలం రేపింది. అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఓ మహిళపై పోలీసుల లాఠీచార్జ్ వీడియో కూడా వైరల్ అయింది.

ప్రతిపక్ష నేత సువేందు అధికారి, ఎంపీ లాకెట్ చటర్జీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ హింసాత్మక నిరసనల తర్వాత రాష్ట్రంలో రాజకీయ దుమారం రేగింది. బీజేపీ, టీఎంసీలు ఒకదానిపై ఒకటి ఆరోపణ ప్రత్యారోపణలు చేసుకున్నాయి. పోలీసులు రెచ్చగొట్టడం వల్లే ఇంత హింస చెలరేగిందని బీజేపీ నేతలు పేర్కొన్నారు.

Scroll to load tweet…

పోలీసుపై దాడి వీడియో సోషల్ మీడియాలోనూ కలకలం రేపింది. కొందరు గుమిగూడి ఓ పోలీసు అధికారిని టార్గెట్ చేసుకుని దాడి చేస్తుండగా ఆ వీడియో మొదలైంది. ఆ పోలీసు అధికారి తన హెల్మెట్‌ను భద్రంగా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా తన తలను కాపాడుకున్నారు. ఎలాగోలా ఆ మూక నుంచి తప్పించుకుని బయట పడగా.. తెల్ల చొక్కా వేసుకున్న మరో వ్యక్తి ఆ పోలీసు అధికారిని దారుణంగా అడ్డుకున్నాడు. ఆయన ఒక్క ఉదుటన ఆగిపోయాడు. ఓ వ్యక్తి రాయితో వేగంగా కొడుతున్న దృశ్యం వీడియోలో చూడొచ్చు. ఆ రాయి వెళ్లి పోలీసు పొట్టపై తాకింది. ఇతరులు కర్రలతో ఆ పోలీసును కొట్టారు. మరికొందరు చేతులతోనే చితకబాదారు. ఇందులో చాలా మంది బీజేపీ జెండాలు పట్టుకుని ఆ పోలీసును కొడుతున్నట్టు మనకు వీడియోలో కనిపిస్తున్నది.

అక్కడి నుంచి కూడా పోలీసు అధికారి తప్పించుకుని బారికేడ్లు పెట్టిన వైపు వేగంగా పరిగెత్తాడు. ఇంతలో ఇంకొకరు ఎదురుగా వచ్చి నెట్టేశారు. అదే వేగంతో ఆయన పక్కనే ఉన్న స్కూటీపై పడిపోయారు. ఆ తర్వాత కింద పడిపోయారు. ఆయన చుట్టు చాలా మంది చేరి మళ్లీ దాడి చేశారు. ఇంతలో బ్లూకలర్ టీ షర్ట్ వేసుకున్న ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆ పోలీసును కాపాడారు. బహుశా వారు స్థానికులు అని చెబుతున్నారు.

ఆ పోలీసు అధికారి చేయి ఫ్రాక్చర్ అయినట్టు సమాచారం.