ఖలిస్తాన్ ఉద్యమాన్ని వ్యతిరేకిస్తూ ఓ రైట్ వింగ్ సంస్థ సభ్యులు పంజాబ్ లోని పాటియాలలో శుక్రవారం తీసిన ర్యాలీ ఉద్రిక్తతలకు దారి తీసింది. రెండు వర్గాల మధ్య హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో ముగ్గురు పోలీసు ఉన్నతాధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది.
పంజాబ్‌లోని పాటియాలాలో ఇరువర్గాల మధ్య శుక్రవారం హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. శాంతి భద్రతలను పరిరక్షించడంలో విఫలమయ్యారంటూ సీఎం భగవంత్ మాన్ పోలీసు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (IG), సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP), పాటియాలా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SP)లను తక్షణమే బదిలీ చేశారు. వారి స్థానంలో ముఖ్విందర్ సింగ్ చిన్నా (IG), దీపక్ పారిక్ (SSP), వజీర్ సింగ్ (SP)లను నియమించారు.
ఇదే సమయంలో సాయంత్రం 6 గంటల వరకు మొబైల్ ఇంటర్నెట్, మెసేజింగ్ సేవలను కూడా నిలిపివేశారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. “ ఇటీవలి ఘటనల కారణంగా పాటియాలా జిల్లా పరిధిలో ఉద్రిక్తత, ప్రజలకు చికాకు, ఆటంకం, గాయాలు, మానవ ప్రాణాలకు, ఆస్తులకు ప్రమాదం, అశాంతి కలిగే అవకాశం ఉంది. కాబట్టి మొబైల్ ఇంటర్నెట్ సేవలు, SMS సేవలు, అన్ని డాంగిల్ సేవలు నిలిపివేయాలని ఆదేశాలు ఇస్తున్నాం 30 ఏప్రిల్ 2022న ఉదయం 9.30 నుండి సాయంత్రం 6 గంటల వరకు వాయిస్ కాల్‌లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ’’ అని ప్రకటన పేర్కొంది.
అసలేం జరిగిందంటే..
ఖలిస్తాన్ ఉద్యమాన్ని వ్యతిరేకిస్తూ మితవాద గ్రూపు శివసేన (బాల్ థాకరే) సభ్యులు శుక్రవారం సాయంత్రం పాటియాలలోని ఆర్యసమాజ్ చౌక్ నుండి కాళీ దేవి ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సమయంలో ఖలిస్తాన్ ముర్దాబాద్ అంటూ నినాదాలు చేశారు. అయితే ఈ సమయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఓ వర్గంపై మరో వర్గం రాళ్లు రువ్వుకున్నారు. కత్తులు దూసుకున్నారు. దీనిని నివారించడానికి పోలీసులు గాలిలోకి అనేక రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో పాటు రాత్రి 7 గంటల నుండి పాటియాలాలో 11 గంటల కర్ఫ్యూ విధించారు. ఈ ఘటనలో మొత్తం నలుగురు వ్యక్తులకు గాయాలు అయ్యాయి.
మార్చి పంజాబ్ సీఎంగా భగవంత్ మాన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రంలో చోటు చేసుకున్న మొదటి పెద్ద సంఘటన ఇది. ఈ ఘటన అనంతరం సీఎం ట్వీట్ చేశారు. “ పాటియాలాలో జరిగిన ఘర్షణల ఘటన చాలా దురదృష్టకరం. డీజీపీతో మాట్లాడి ఆ ప్రాంతంలో శాంతిని నెలకొల్పాం. మేము పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాము. రాష్ట్రంలో ఎవరూ అల్లకల్లోలం సృష్టించనివ్వము. పంజాబ్ శాంతి, సారస్యం అత్యంత ముఖ్యమైనది.’’ అని భగవంత్ మాన్ పేర్కొన్నారు. ఈ ఘటనపై తక్షణ విచారణకు పిలిపునిస్తున్నట్టు తెలిపారు. దోషులను విడిచిపెట్టకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీనిపై ప్రతిపక్ష కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్ స్పందించాయి. ఈ ఘటనను అరాచకంగా అభివర్ణించాయి.
