అగ్నిపథ్ స్కీమ్ పై ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. డిఫెన్స్ ఉద్యోగులు బీహార్,యూపీలో రెండో రోజు నిరసనలు తెలిపారు. అయితే ఇవి హింసాత్మకంగా మారాయి. నిరసనకారులు రోడ్లపై వాహనాలను తగులబెట్టారు. రైళ్లకు నిప్పుపెట్టారు. పోలీసుపై రాళ్లురువ్వారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

అగ్నిపథ్ స్కీమ్ ను వ్యతిరేస్తూ చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఆర్మీ ఉద్యోగ ఆశావహులు వరుసగా రెండో రోజు బీహార్‌లోని అనేక ప్రాంతాల్లో రైళ్ల‌ను అడ్డుకున్నారు. రోడ్డు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారు. రైళ్లకు నిప్పు పెట్టారు. బస్సుల కిటికీల అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో రోడ్ల‌పై వాహ‌నాలు ఎక్క‌డిక‌క్క‌డే నిలిచిపోయాయి. ఆగ్ర‌హంతో రాళ్లు రువ్వారు. బీజేపీ ఎమ్మెల్యేపై దాడి చేశారు. కొత్త రిక్రూట్ మెంట్ స్కీమ్ ను వెన‌క్కి తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. 

ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్న ఆ లీవ్ లెటర్.. ఏం నిజాయితీరా బాబు అంటూ నెటిజన్ల కామెంట్లు

ఈ ఆందోళ‌న‌ల వ‌ల్ల 22 రైళ్లను పాక్షికంగా ర‌ద్దు చేశారు. లాఠీలు చేతపట్టిన నిరసనకారులు భభువా రోడ్ రైల్వే స్టేషన్‌లో ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు అద్దాలను పగులగొట్టారు. ఒక కోచ్‌కు నిప్పు పెట్టారు. ‘‘ఇండియన్ ఆర్మీ ప్రేమికులు’’ అనే బ్యానర్ ను ప్రదర్శిస్తూ అగ్నిపథ్ స్కీమ్ ను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. ఈ నిర‌స‌న‌ల వ‌ల్ల ఐదు రైళ్లను నిలిపివేయాల్సి వ‌చ్చింద‌ని తూర్పు మధ్య రైల్వే ప్ర‌క‌టించింది.

Scroll to load tweet…

నవాడలో కోర్టుకు వెళుతున్న బీజేపీ ఎమ్మెల్యే అరుణాదేవి వాహనంపై ఆందోళనకారులు రాళ్లు రువ్వి, దాడి చేశారు. దీంతో ఆ ఎమ్మెల్యేతో పాటు ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారు. నవాడాలోని బీజేపీ కార్యాలయాన్ని కూడా ధ్వంసం చేశారు. ‘‘ నా కారుకు పార్టీ జెండాను అమర్చి ఉంది. దీనిని చూసిన ఆందోళ‌నకారులు రెచ్చిపోయారు. ఆ జెండాను చింపివేశారు. నా డ్రైవర్, ఇద్దరు సెక్యూరిటీ గార్డులు, ఇద్దరు వ్యక్తిగత సిబ్బందికి గాయాలయ్యాయి ’’ అని ఆ ఎమ్మెల్యే మీడియాతో తెలిపారు. 

Scroll to load tweet…

అర్రాలోని రైల్వే స్టేషన్ వద్ద పోలీసుల‌పై నిర‌స‌న కారులు రాళ్లురువ్వారు. దీంతో ఆ గుంపును చెద‌ర‌గొట్ట‌డానికి పోలీసులు టియర్ గ్యాస్ ను ఉప‌యోగించారు. ఆందోళనకారులు ఫర్నీచర్‌ను ట్రాక్‌లపై విసిరి వాటిని తగులబెట్టారు. ఆ మంట‌ల‌ను ఆర్పేందుకు రైల్వే సిబ్బంది అగ్నిమాపక పరికరాలను ఉప‌యోగించారు. జెహనాబాద్‌లో విద్యార్థులు రాళ్లు రువ్వారు. రైలు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడానికి ట్రాక్ ల‌పై కూర్చున్నారు. దీంతో వారిని త‌రిమికొట్టేందుకు ప్ర‌య‌త్నించిన స‌మ‌యంలో పోలీసులుతో పాటు ప‌లువురు గాయ‌ప‌డ్డారు. ఈ రైల్వే స్టేషన్ స‌మీపంలో నిర‌స‌నకారులు, పోలీసులు ఒక‌రిపై ఒక‌రు రాళ్లు రువ్వుకున్నారు. అయితే ఆందోళ‌కారుల‌ను భయపెట్టేందుకు పోలీసులు తుపాకులు కూడా గురి పెట్టాల్సి వ‌చ్చింది. 

Scroll to load tweet…

నవాడలో యువకుల గుంపు పబ్లిక్ క్రాసింగ్ వద్ద టైర్లను కాల్చివేసి, టూర్ ఆఫ్ డ్యూటీ పథకాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. నవాడా స్టేషన్‌లో రైలు పట్టాలనుపై కూర్చొని ట్రాక్‌పై టైర్లను తగులబెట్టారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని విమ‌ర్శిస్తూ నినాదాలు చేశారు. పోలీసులు వారిని శాంతింప‌జేయ‌డానికి ప్ర‌య‌త్నించారు. అలాగే సహర్సాలో నిర‌స‌నకారులు రైలు రాకపోకలకు అంత‌రాయం క‌లిగించారు. దీంతో వారిని పోలీసులు త‌రిమికొట్టాల‌ని భావించారు. అయితే ఈ స‌మ‌యంలో పోలీసుల‌పై ఆందోళ‌న‌కారులు రాళ్లు రువ్వారు. చాప్రాలో కూడా హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు జ‌రిగాయి. ర‌హ‌దారిపై బ‌స్సుల‌ను ధ్వంసం చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని అనేక ప్రాంతాల్లో కూడా నిర‌స‌లు జ‌రిగాయి. కాగా బీహార్, యూపీలో బుధ‌వారం కూడా ఆందోళ‌న‌లు జ‌రిగాయి.