అరెస్టు చేసినవారిని విడుదల చేయాలని పోలీసు స్టేషన్ల ముట్టడి.. మణిపూర్‌లో మళ్లీ ఆంక్షలు
మణిపూర్‌లో ఇంఫాల్ ఈస్ట్, వెస్ట్‌లో మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పోలీసులు అరెస్టు చేసిన ఐదుగురు యువకులను వెంటనే విడుదల చేయాలని, లేదంటే తమనూ అరెస్టు చేయాలని వందలాది మంది మైతేయీ తెగ ప్రజలు పోలీసు స్టేషన్‌లలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు టియర్ గ్యాస్ ఫైర్ చేయడంతో పది మందికి గాయాలు అయ్యాయి. పరిస్థితులు అదుపు దాటిపోకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా ఈ రెండు జిల్లాల్లో సడలించిన ఆంక్షలను మళ్లీ విధించారు.

గువహతి: మణిపూర్‌లో చెలరేగిన అలజడులు సర్దుకోవడం లేదు. ఇంకా అక్కడ ఉద్రిక్త వాతావరణమే నెలకొని ఉన్నది. నెలలపాటు అక్కడ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. కొంత పరిస్థితులు ఆశాజనకంగా మారుతున్నాయనే అభిప్రాయం ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఆంక్షలు సడలించారు. కానీ, తాజాగా చోటుచేసుకున్న ఘటనతో రెండు ఇంఫాల్ జిల్లాల్లో ఆంక్షలు మళ్లీ విధించారు.
సెప్టెంబర్ 16వ తేదీన మణిపూర్ పోలీసులు ఐదుగురు యువకులను అరెస్టు చేశారు. వారు కొన్ని అత్యాధునిక ఆయుధాలు పట్టుకుని మిలిటరీ యూనిఫామ్ ధరించి ఉన్నారు. పోలీసులు వారిని అరెస్టు చేసి జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. రిమాండ్ కింద పోలీసు కస్టడీలో ఉంచుకున్నారు.
వీరిని విడుదల చేయాలని వందలాది మంది పలు పోలీసు స్టేషన్లను ముట్టడించారు. ఆ ఐదుగురు స్వచ్ఛంద గ్రామ వాలంటీర్లను విడుదల చేయాలని, లేదంటే తమను కూడా అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పరిస్థితులను అదుపులో ఉంచడానికి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ ఘటనలో పది మందికి గాయాలు అయ్యాయి.
Also Read: పుట్టింటి నుంచి భార్య రావట్లేదని భర్త మనస్తాపం, ఆత్మహత్య
తమ గ్రామ వాలంటీర్లను అరెస్టు చేస్తే చుట్టూ ఉన్న కొండ ప్రాంతాల్లోని కుకీ మిలిటెంట్ల నుంచి తమ మైతేయీ సముదాయాన్ని ఎవరూ రక్షిస్తారని వారు ప్రశ్నించారు. ఇంపాల్ ఈస్ట్‌లోని పొరంపాట్ పోలీసు స్టేషన్‌లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఇంఫాల్ వెస్ట్ జిల్లాలోని సింగ్జమెయ్ పోలీసు స్టేషన్‌లోకి బలవంతంగా దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. క్వాకెతెయ్ పోలీసు ఔట్‌పోస్టు వద్ద ఇలాంటి పరిస్థితులే కనిపించాయి. అయితే, పోలీసులు వ్యూహాత్మక ప్రాంతాల్లో మోహరించి పరిస్థితులను అదుపులోనే ఉంచారు.
ఈ ఘటనతో ఇంఫాల్ వెస్ట్ జిల్లా మెజిస్ట్రేట్ కర్వ్యూ సడలింపును ఉపహరిస్తున్నట్టు ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి ప్రతి కదలికలపై ఆంక్షలు ఉంటాయని వివరించారు. ఇలాంటి ఆదేశాలు ఇంఫాల్ ఈస్ట్ జిల్లాలోనూ అమల్లోకి వచ్చాయి.