Asianet News TeluguAsianet News Telugu

అమెరికాలో ఇండియన్ కాన్సులేట్‌పై దాడి.. 10 మంది ఖలిస్తానీ మద్దతుదారుల ఫోటోలను విడుదల చేసిన ఎన్‌ఐఏ..

అమెరికాలోని ఇండియన్ కాన్సులేట్‌పై దాడికి  పాల్పడిన వారి ఫొటోలను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) గురువారం విడుదల చేసింది.

Violence at Indian Consulate in USA San Francisco NIA released photos of 10 Khalistani supporters ksm
Author
First Published Sep 21, 2023, 5:22 PM IST

అమెరికాలోని ఇండియన్ కాన్సులేట్‌పై దాడికి  పాల్పడిన వారి ఫొటోలను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) గురువారం విడుదల చేసింది. అమెరికా శాన్ ఫ్రాన్సిస్కోలోని ఇండియన్ కాన్సులేట్‌పై దాడి, విధ్వంసం కేసులో వాంటెడ్ నిందితులుగా ఉన్న 10 మంది చిత్రాలను విడుదల చేసిన ఎన్‌ఐఏ.. వారి గురించి సాధారణ ప్రజల నుండి సమాచారాన్ని కోరింది. వాంటెడ్ నిందితులకు వ్యతిరేకంగా మూడు వేర్వేరు “గుర్తింపు, సమాచారం కోసం అభ్యర్థన” నోటీసులు జారీ చేసినట్లు ఎన్‌ఐఏ గురువారం ఏజెన్సీ తెలిపింది. తద్వారా వారి అరెస్టు లేదా నిర్బంధానికి దారితీసే సమాచారాన్ని కోరింది.

నిందితులకు సంబంధించి సమాచారాన్ని పంచుకునే ఎవరి గుర్తింపును బహిర్గతం చేయబోమని ఎన్‌ఐఏ హామీ ఇచ్చింది. ఇక, ఎన్‌ఐఏ జారీ చేసిన మూడు నోటీసుల్లో..రెండు నోటీసుల్లో ఇద్దరు నిందితుల చొప్పున ఫొటోలు ఉండగా,  మూడో నోటీసులో మరో కేసులో ప్రమేయం ఉన్న ఆరుగురు నిందితుల చిత్రాలు ఉన్నాయి.

ఎన్‌ఐఏ ప్రకారం.. శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌పై దాడి మార్చి 18-19 మధ్య రాత్రి సమయంలో జరిగింది. కొన్ని ఖలిస్తానీ అనుకూల సంస్థలు కాన్సులేట్‌లోకి చొరబడి దానిని తగలబెట్టడానికి ప్రయత్నించాయి. అదే రోజు నినాదాలు చేసిన ఖలిస్తాన్ మద్దతుదారులు నగర పోలీసులు ఏర్పాటు  చేసిన తాత్కాలిక భద్రతా అడ్డంకులను ఛేదించి.. కాన్సులేట్ ప్రాంగణంలో రెండు ఖలిస్తానీ జెండాలు ఉంచారు. కాన్సులేట్ భవనాన్ని ధ్వంసం చేశారు. కాన్సులేట్ అధికారులపై దాడి చేసి గాయపరిచారు. 

 

ఈ దాడిపై దర్యాప్తు చేసేందుకు ఈ ఏడాది జూన్‌లో ఎన్‌ఐఏ కేసు నమోదు చేసింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం, ప్రజా ఆస్తులకు నష్టం కలిగించే నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్‌లను ఇందులో చేర్చారు. ఇంకా జూలై 1- జూలై 2 మధ్య రాత్రి.. కొంతమంది నిందితులు కాన్సులేట్‌లోకి చొరబడ్డారు. కాన్సులేట్ అధికారులు భవనం లోపల ఉండగా కాన్సులేట్‌కు నిప్పు పెట్టడానికి ప్రయత్నించారు. ఇక, ఒక ఎన్‌ఐఏ బృందం గత నెలలో అమెరికాను సందర్శించింది. అక్కడ వారు భారత కాన్సులేట్‌లోని సీనియర్ అధికారులతో పాటు భద్రతా సిబ్బంది వాంగ్మూలాలను రికార్డ్ చేశారు. సీసీటీవీ ఫుటేజీలు, పగిలిన అద్దాలు వంటి ఆధారాలను కూడా సేకరించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios