చెన్నైలోని ఓ పురాతన ఆలయంలో గుప్తనిధులు బయటపడ్డాయి. అయితే వీటిని ప్రభుత్వానికి అప్పగించడానికి ఆ గ్రామస్తులు ఒప్పుకోలేదు. దీంతో అధికారుల హెచ్చరికలు, పోలీసుల జోక్యంతో నగలు ట్రెజరీకి తరలించారు. 

వివరాల్లోకి వెడితే.. చెన్నై, కాంచీపురం జిల్లా ఉత్తర మేరు గ్రామంలో పురాతన కులంబేశ్వరర్‌ ఆలయం ఉంది. ఇటీవల గ్రామస్తులు ఈ ఆలయ జీర్ణోద్ధరణ పనులు మొదలుపెట్టారు. ఈ పనుల్లో భాగంగా శనివారం నాడు గర్భగుడిలో తవ్వకాలు చేపట్టారు. ఈ తవ్వకాల్లో 561 గ్రాములతో కూడిన ఈ బంగారు నగలు బయట పడ్డాయి. 

ఈ విషయం తెలిసిన కాంచీపురం జిల్లా కలెక్టర్‌ మహేశ్వరి బంగారాన్ని ట్రెజరీకి అప్పగించాలని గ్రామస్తులకు ఆదేశాలు జారీ చేశారు.  అయితే ఆ నిధి తమకే సొంతం అని గ్రామస్తులు ప్రకటించారు. దీంతో ఆదివారం కాంచీపురం ఆర్డీఓ దివ్య నేతృత్వంలో బృందం ఆ గ్రామానికి వెళ్లింది. గ్రామస్తులను బుజ్జగించి ఆ నిధిని ట్రెజరీకి తరలించేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ, గ్రామస్తులు ఏమాత్రం తగ్గలేదు.

 ఆ నిధి తమ గ్రామ ఆలయానికి చెందింది అని, దీనిని ప్రభుత్వానికి అప్పగించే ప్రసక్తే లేదని తేల్చారు. వందేళ్లకు పైగా చరిత్ర కల్గిన ఈ ఆలయం చోళుల హయాంలో నిర్మించారు. అయితే, ఈ ఆలయం ఇప్పటికీ వంశపారంపర్యంగా గ్రామ పెద్దలే నిర్వహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దేవాదాయశాఖ పరిధిలో లేదు కాబట్టి నగలు గ్రామానికే చెందుతాయని గ్రామస్తులు తేల్చారు. 

ఈ నిధి తమ ఆలయానికి సొంతమని, తమ ఆలయానికే ఉపయోగిస్తామని తేల్చడంతో పోలీసుల్ని రంగంలోకి దించాల్సి ఉంటుందని అధికారులు హెచ్చరించారు. పోలీసుల్ని రంగంలోకి దించేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంది. తమపై ఒత్తిడి పెరగడంతో గ్రామ పెద్దలు వెనక్కి తగ్గారు. 

కొందరు అప్పగింతకు వ్యతిరేకించినా, పెద్దలు దిగిరాక తప్పలేదు. అధికారులకు ఓ మెలిక పెట్టారు. నిర్మాణం, జీర్ణోద్ధరణ పనులు ముగిసినానంతరం  ఆభరణాలు ఆలయానికే అప్పగించాలని, అంత వరకు ట్రెజరీలో ఉండేలా అధికారులతో ఒప్పందం కుదుర్చుకున్న అనంతరం అప్పగించారు.