పదేళ్ల చిన్నారి నదిలో ఈతకు వెళ్లాడు. కనిపించకుండా పోయాడు. బాలుడిని మొసలి మింగేసిందని గ్రామస్తులు అనుమానించారు. దాన్ని పట్టుకుని చిత్రహింసలకు గురి చేశారు. చివరికి.. 

మధ్యప్రదేశ్ : పిల్లాడిని మింగేసిందన్న అనుమానంతో ఓ మొసలిని బంధించి చిత్రహింసలకు గురి చేశారు ఆ గ్రామ ప్రజలు. బాలుడు మొసలి కడుపులో బతికే ఉన్నాడని, ఎలాగైనా బైటికి తీయాలని తీవ్ర ప్రయత్నాలు చేశారు. అటవీశాఖ సిబ్బంది నచ్చజెప్పడంతో ఆ మొసలికి విముక్తి కల్పించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ష్యోపుర్ జిల్లా రిఝెంటా గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన 10 ఏళ్ల బాలుడు అతర్ సింగ్ సోమవారం చంబల్ నదిలో స్నానానికి వెళ్ళాడు. కాసేపటి తర్వాత కనిపించకుండాపోయాడు.

బాలుడిని మొసలి మింగేసిందని గ్రామస్తులంతా అనుకున్నారు. ఓ వల తెచ్చి దాన్ని పట్టుకున్నారు. ఒడ్డుకు లాక్కొచ్చి తాళ్లతో కట్టి పడేసారు. బాలుడికి ఆక్సిజన్ అందడం కోసం మొసలి నోరు తెరిచి ఉంచేలా పెద్ద కర్ర పెట్టారు. చివరికి పొట్ట చీల్చి, బాలుడిని బయటకు లాగడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో చిత్రహింసలు పెట్టారు. ఈ విషయం పోలీసులకు తెలిసింది. అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. గ్రామానికి చేరుకున్నారు. గ్రామస్తులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. 

ఒకవేళ నిజంగానే మొసలి బాలుడిని మింగి ఉంటే.. కడుపులో బాలుడు బతికి ఉండే అవకాశం లేదని.. అధికారులు ఎంతగా నచ్చజెప్పినా బాలుడి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. చివరకు అనేక ప్రయత్నాల తరువాత వారు, గ్రామస్తులు మొసలిని వదిలేందుకు ఒప్పుకున్నారు. 
మొసలిని తిరిగి నదిలోకి విడిచిపెట్టారు. బాలుడి కోసం గాలించగా మంగళవారం నదిలో శవమై కనిపించాడు. బాలుడు స్నానం చేస్తూ నదిలోకి లోతుగా వెళ్లిపోయాడని దీంతో చనిపోయాడని తెలిపారు. 

Scroll to load tweet…