న్యూఢిల్లీ: భారత, పాక్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులు నిర్ణయం తీసుకొన్నారు. 

ఉత్తర కాశ్మీర్‌లోని ఉరీ సెక్టార్‌లో నియంత్రణ రేఖ ప్రాంతాల్లో ఉండే పలు గ్రామాల ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలించాలని స్థానిక అధికారులు నిర్ణయించారు.  ప్రజల భద్రత దృష్ట్యా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి సిద్దమౌతున్నారు.

సరిహద్దు నియంత్రణ రేఖ వెంట పాకిస్థాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడుతోందని అధికారులు తెలిపారు. పాక్ జరిపిన కాల్పుల్లో ఐదుగురు భారత జవాన్లు గాయపడ్డారు. పలు చోట్ల ఇళ్లు ధ్వంసమయ్యాయి.పీఓకే నుండి  కాల్పులు జరుగుతున్నట్టుగా స్థానికులు చెబుతున్నారు. తెల్లవారుజామున కాల్పులు చోటు చేసుకొన్నాయని స్థానికులు తెలిపారు.