ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాలే ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. రాజకీయ నాయకులు, విశ్లేషకులు మొదలుకుని సామాన్య ప్రజలు కూడా ఈ ఫలితాలపైనే చర్చించుకుంటున్నారు. ప్రధాని మోదీ చరిష్మాతో మళ్లీ 2019 పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించాలని ప్రయత్నిస్తున్న బిజెపికి ఈ ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలిందని అభిప్రాయపడుతున్నారు. అయితే ఇలా మూడు రాష్ట్రాలను హస్తగతం చేసుకోవడంతో  కాంగ్రెస్ పార్టీ, నాయకులపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా ఓ వ్యక్తి కాంగ్రెస్ నాయకులకు అభినందనలు తెలుపడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. 

భారత దేశంలో వ్యాపారాల పేరిట వివిధ బ్యాంకుల నుండి భారీగా అప్పులు తీసుకుని...వాటిని ఎగ్గొట్టడానికి విదేశాలను పారిపోయాడు కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా. దాదాపు
9 వేల కోట్ల రుణాలను బ్యాంకులకు బకాయి పడ్డ  అతడు ప్రస్తుతం ఇంగ్లాండ్ లో నివాసం ఉంటున్నాడు. అయితే ఇటీవల వెలువడిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై తాజాగా అతడు స్పందించారు.

రాజస్థాన్, మధ్యప్రదేశ్ లలో కాంగ్రెస్ పార్టీ తిరిగి పుంజుకుని... విజయం సాధించడంలో కీలక పాత్ర వహించిన యువ నాయకులకు మాల్యా అభినందనలు తెలిపారు. రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్ సచిన్ ఫైలట్, మధ్య ప్రదేశ్ నాయకులు జ్యోతిరాధిత్య సింథియాలను యువ ఛాంపియన్లుగా పేర్కొంటూ మాల్యా ట్వీట్ చేశారు. వారికి అభినందనలు తెలిపారు. 

మాల్యా విషయంలో ఇప్పటికే బిజెపి, కాంగ్రెస్ లు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ సమయంలో బిజెపి ఓటమిపై మాల్యా స్పందిస్తూ...కాంగ్రెస్ నాయకులను అభినంధిస్తూ ట్వీట్ చేయడం  తీవ్ర దుమారానికి కారణమవుతోంది.