ప్రస్తుతం దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ  చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు, ఆగ్రహ జ్వాలలు వ్యక్తమౌతున్నాయి. అయితే... ఈ ఆందోళనలను ఆపేందుకు ఓ పోలీస్ అధికారి చేసిన ప్రయత్నం అందరినీ ఆకట్టుకుంది. పోలీసులు ఎంత ప్రయత్నించినా, నచ్చచెప్పినా... ఆందోళనలు విరమించకపోవడంతో... వారిని కేవలం జాతీయ గీతంతో శాంతింప చేశారు. 

దేశ భక్తి గేయాన్ని ఆయన ఆలపించడం మొదలుపెట్టగానే అందరూ నిశ్శబ్దమయ్యారు. కాగా... ఆయన చేసిన పని ఇప్పుడు అందరి హృదయాన్ని తట్టి లేపింది. ప్రతి ఒక్కరూ ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ సంఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.

ఇంతకీ మ్యాటరేంటంటే... పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన ఆందోళనలు దేశమంతా విస్తరించిన విషయం తెలిసిందే. కర్ణాటక రాజధాని బెంగళూరులోనూ గురువారం పెద్ద ఎత్తున నిరసనలు చోటుచేసుకున్నాయి. నగరంలోని టౌన్ హాల్ వద్దకు వందలాది మంది ఆందోళనకారులు చేరి నిరసన చేపట్టారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకొని వారిని అడ్డుకునేందుకు యత్నించారు.

బెంగళూరు డీసీపీ చేతన్ సింగ్ రాఠోడ్ ఆందోళనకారులకు నచ్చచెప్పే ప్రయత్నంచేశారు. సంఘ వ్యతిరేక శక్తులు తమ స్వప్రయోజనాల కోసం ఇలాంటి ఆందోళనలు చేయిస్తున్నాయని హెచ్చరించారు. అయినప్పటికీ నిరసనకారులు వినిపించుకోకపోవడంతో... వెంటనే ఆయన జాతీయ గీతాన్ని ఆలపించారు. జనగనమన అంటూ ఆయన జాతీయ గేయం ఆలపించగానే అక్కడంతా నిశ్శబ్ధం చోటుచేసుకుంది.ఆయనతోపాటు అక్కడున్నవారు కూడా జాతీయగీతాన్ని ఆలపించారు.

అనంతరం నిరసన కారులంతా అక్కడి నుంచి నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనిని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా... ఈ వీడియో వైరల్ గా మారింది.