తమిళనాడులో ఖాకీల తీరుపట్ల సర్వత్రా విమర్శలు వస్తున్నప్పటికీ.. వారి తీరులో మాత్రం మార్పు రావడం లేదు. జయరాజ్, బెనిక్స్ అనే తండ్రి కొడుకుల లాక్‌ప్ డెత్ తర్వాత తమిళ పోలీసుల ప్రవర్తన పట్ల ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

తాజాగా భర్తని గొడ్డుని బాదినట్లుగా బాదడంతో ఓ ఇల్లాలు తట్టుకోలేకపోయింది. పట్టరాని కోపంతో ఏకంగా ఎస్సై చెంప పగలగొట్టింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో జరిగింది.

వివరాల్లోకి వెళితే... విల్లుపురం జిల్లా అనత్తూర్ గ్రామానికి చెందిన ముత్తురామన్ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ప్రభుత్వం ప్రకటించిన షార్ట్‌లిస్ట్‌లో అతని పేరు వుంది.

అయితే ఇళ్ల నిర్మాణ పనులు పర్యవేక్షించేందుకు వచ్చిన ప్రైవేట్ కాంట్రాక్టర్‌ సుభాష్ చంద్రబోస్ అనే వ్యక్తితో ముత్తురామన్‌కు వివాదం తలెత్తింది. ఇంటి కోసం తన వద్ద డబ్బులు తీసుకుని మోసం చేశాడని కాంట్రాక్టర్‌పై ముత్తురామన్ ఆరోపణలు చేశాడు.

అంతేకాకుండా దీనిపై తిరువెన్నైలూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశాడు. దీనిలో భాగంగా విచారణ నిమిత్తం పోలీసులు అనత్తూర్ చేరుకున్నారు. ఆ సమయంలో పీకలదాకా మద్యం తాగి.. మత్తులో ఉన్న ముత్తురామన్ పోలీసులకు సరిగ్గా సమాధానం ఇవ్వలేదు.

దీంతో చిర్రెత్తుకొచ్చిన పోలీసులు అతనిని రక్తం వచ్చేలా కొట్టారు. తన కళ్లేదుట భర్తను కొట్టడాన్ని తట్టుకోలేకపోయిన అతని భార్య సారధి కోపంతో ఊగిపోయింది. ఏకంగా ఎస్సై చెంప  పగలగొట్టింది.

దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. స్థానికులు పెద్ద సంఖ్యలో గుమిగూడటంతో పాటు పోలీసులకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. దీంతో ఖాకీలు అక్కడి నుంచి వెనుదిరిగారు.

మరోవైపు ముత్తురామన్ భార్య పోలీస్‌పై చేయి చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు స్పందించారు. విచారణ జరిపి నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.