ఓ బైకర్ పెద్ద ప్రమాదం నుంచి అద్భుతంగా తప్పించుకున్నాడు. అతివేగంతో ఉన్న ఆ బైక్ అదుపుతప్పడంతో గాల్లోకి పల్టీలు కొట్టింది. ఆ బైక్ ఉన్న యువకుడు కూడా రోడ్డు వెంట జారుతూ కొంత దూరం వెళ్లి ఆగిపోయాడు. అయితే ఆ బైక్ మాత్రం ట్రాన్స్ ఫార్మర్ కంచెలో పడిపోయింది. ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది.
అతివేగం ప్రమాదకరం.. నిదానమే ప్రధానం అంటూ పోలీసులు, ట్రాఫిక్, ఆర్టీఏ అధికారులు ప్రజలకు ఎన్ని అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్న కొందరు మాత్రం మారడం లేదు. వాహనాలను వేగంగా నడుపుతూ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. అతివేగం వల్ల జరిగిన ప్రమాదాలను మనం తరచూ ఎన్నో చూస్తుంటాం. అయితే ఓ అదృష్టవంతుడు అతివేగం వల్ల ఏర్పడిన భారీ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
కేరళ రాష్ట్రంలో జరిగిందీ ఘటన. ఇడుక్కిలోని వెల్లయంకుడి ప్రాంతంలో విష్ణు ప్రసాద్ అనే యువకుడు బైక్ పై అతి వేగంగా వస్తున్నాడు. దీంతో ఒక్కసారిగా ఆ బైక్ అదుపుతప్పింది. అదే వేగంలో ఆ బైక్ పల్టీలు కొట్టింది. అమాంతం గాలీలో లేస్తూ ఎదురుగా ఉన్న ట్రాన్స్ ఫార్మర్ కంచెలో పడిపోయింది. ఈ యువకుడు కూడా రోడ్డు వెంట పొర్లుతూ ట్రాన్స్ ఫార్మర్ కు కొంచెం దూరంలో వెళ్లి ఆగిపోయాడు. అంత పెద్ద ప్రమాదం నుంచి అతడు సురక్షితంగా భయటపడ్డాడు. ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది.
ఈ ప్రమాదం అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. ఈ తీరంతా చూస్తే సినిమాల్లో హీరోలు చేసే స్టంట్ లాగా కనిపించింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు ఆ యువకుడు కనీసం హెల్మెట్ కూడా ధరించలేదు. ఈ ప్రమాదం విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. కరెంటు సరఫరా నిలిపివేసి బైక్ ను బయటకు తీశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
