న్యూఢిల్లీ: రాజకీయ నేతలు ఓట్లను కొనుగోలు చేస్తున్నారు, ఓటర్లు తమ ఓట్లను అమ్ముకొంటున్నారని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. 

గురువారం నాడు జరిగిన ఓ కార్యక్రమంలో  ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు అన్ని ఉచితంగా ఇస్తామంటారు.ఎన్నికల తర్వాత చేతులెత్తేస్తారని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు.

ఎన్నికల్లో గెలవడం కోసం కోట్లు ఖర్చు పెడతారు, గెలవగానే అవినీతికి పాల్పడతారని వెంకయ్యనాయుడు ప్రస్తుత  రాజకీయాల్లో చోటు చేసుకొన్న పరిణామాలపై వ్యాఖ్యానించారు. 

ఎన్నికల సభల నిర్వహణకే కోట్లాది రూపాయాలను ఖర్చు చేస్తున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఎన్నికల్లో డబ్బు ప్రవాహన్ని అరికట్టాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు.

రాజకీయాలతో తనకు సంబంధం లేనందున తాను  అన్ని విషయాలపై జంకుబొంకు లేకుండా మాట్లాడుతున్నానని  వెంకయ్యనాయుడు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మారాల్సింది వ్యవస్థ కాదు, ప్రజలే మారాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఇంటికి ఎన్నికల కమిషన్ వెళ్లి చూడదని వెంకయ్యనాయుడు  చెప్పారు. 

ఎన్నికల ముందు రాజకీయ పార్టీల నేతలు ఏ రకంగా  ఎన్నికల హమీలను కురిపిస్తారో ఆయన ఈ సందర్భంగా వివరించారు. ప్రతి దాన్ని ఉచితంగా ఇస్తామని చెప్పే వస్తువుల జాబితాను ఆయన చెబుతోంటే సభికులు చప్పట్లు కొట్టారు.