న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కరోనా నుండి కోలుకొన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 29వ తేదీన ఆయనకు కరోనా సోకింది. అప్పటి నుండి ఆయన క్వారంటైన్ లో ఉన్నారు. ఎయిమ్స్ కు చెందిన వైద్యుల బృందం ఇవాళ ఆయనను పరీక్షించింది.  ఈ పరీక్షల్లో ఆయనకు కరోనా నుండి కోలుకొన్నట్టుగా నిర్ధారణ అయింది.

 ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ఉపరాష్ట్రపతి తెలిపారు. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని అయితే వైద్యుల సూచనలను మరికొంత కాలం పాటు కొనసాగించడం మంచిదని సూచించారు. ఇంటి నుంచే జాగ్రత్తలు పాటిస్తూ పని చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు.

స్వీయ నిర్బంధ కాలంలో తమ ఆరోగ్య పరిస్థితి గురించి ఉత్తరాలు, మెయిల్స్, మెసేజ్ ల ద్వారా వాకబు చేసిన వారికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.తనకు వైద్య సేవలు అందించిన వైద్యులు, వైద్య సిబ్బందికి ఉపరాష్ట్రపతి కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా తనకు తోడుగా అన్నివేళలా సేవలు అందించిన తమ వ్యక్తిగత సహాయకులకు కూడా ఆయన ధన్యవాదాలు తెలిపారు.