ఉప రాష్ట్రపతి , రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌కర్ వ్యక్తిగత సిబ్బందికి రాజ్యసభ స్టాండింగ్ కమిటీల్లో చోటు దక్కడం వివాదాస్పదం అవుతోంది. పార్లమెంటరీ కమిటీల్లో ఎంపీలకు మాత్రమే స్థానం వుంటుందని వారికి సహకరించడానికి లోక్‌సభ, రాజ్యసభ సచివాలయ సిబ్బందిని మాత్రమే నియమించాలని కొందరు నిపుణులు అంటున్నారు.
ఉప రాష్ట్రపతి , రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌కర్ వ్యక్తిగత సిబ్బందికి రాజ్యసభ స్టాండింగ్ కమిటీల్లో చోటు దక్కడం వివాదాస్పదం అవుతోంది. ఉపరాష్ట్రపతి వ్యక్తిగత సిబ్బందిలోని 8 మంది అధికారులను 12 స్టాండింగ్ కమిటీలు, 8 శాఖా స్టాండింగ్ కమిటీల్లో నియమిస్తూ రాజ్యసభ సెక్రటేరియట్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయంపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. ఉప రాష్ట్రపతి.. వైస్ ఛైర్‌పర్సన్ లేదా ప్యానెల్ ఛైర్‌పర్సన్‌లా సభకు చెందిన సభ్యుడు కాదన్నారు కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ. మరి అలాంటప్పుడు ఆయన తన వ్యక్తిగత సిబ్బందిని పార్లమెంటరీ స్లాండింగ్ కమిటీలలో ఎలా నియమిస్తారని మనీష్ ప్రశ్నించారు. ఇది వ్యవస్థాగత ద్రోహం కాదా అని ఆయన నిలదీశారు.
కాంగ్రెస్ చీఫ్ విప్ జైరాం రమేశ్ మాట్లాడుతూ.. అన్ని రాజ్యసభ కమిటీలకు సరిపడా సిబ్బంది వున్నారని అన్నారు. అయినప్పటికీ ఆ కమిటీలు రాజ్యసభకు మాత్రమే చెందినవని.. చైర్మన్‌కు సంబంధించినవి కావని చురకలంటించారు. పార్లమెంటరీ కమిటీల్లో ఎంపీలకు మాత్రమే స్థానం వుంటుందని వారికి సహకరించడానికి లోక్‌సభ, రాజ్యసభ సచివాలయ సిబ్బందిని మాత్రమే నియమించాలని కొందరు నిపుణులు అంటున్నారు. గతంలో ఇలాంటి నియామకాలు జరగలేదని చెబుతున్నారు.
