భారత ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ అనారోగ్యానికి గురయ్యారు. ఆదివారం తెల్లవారు జామున 2 గంటల సమయంలో అస్వస్తతకు గురైన జగదీప్‌ను వెంటనే ఢిల్లీ ఎయిమ్స్‌లో చేర్పించారు. ఆయన ఆరోగ్యానికి సంబంధించి వైద్యులు కీలక ప్రకటన చేశారు..  

భారత ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఛాతీలో నొప్పి, అసౌకర్యం ఉండడంతో ఆయనను ఆదివారం తెల్లవారు జామున ఎయిమ్స్‌లో చేర్పించారు. 73 ఏళ్ల జగదీప్‌ను ఆదివారం తెల్లవారు జామున 2 గంటల ప్రాంతంలో ఆసుపత్రికి తరలించారు. ఎయిమ్స్‌లోని కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ రాజీవ్ నారంగ్ ఆధ్వర్యంలో ప్రస్తుతం ఉప రాష్ట్రపతి క్రిటికల్ కేర్ యూనిట్ (సిసియు)లో చేర్చారు.

ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండి, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని తెలిపారు. వైద్యుల బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మరికాసేపట్లో ఉప రాష్ట్రపతి ఆరోగ్యానికి సంబంధించి పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 

ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన ఉప రాష్ట్రపతి. 

ఇదిలా ఉంటే ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఇటీవల హైదరాబాద్‌ వచ్చిన విషయం తెలిసిందే. మార్చి 3వ తేదీన ఐఐటీ హైదరాబాద్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను, ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడారు. సృజనాత్మక ఆవిష్కరణలే భారత్‌ పెట్టుబడి అని.. శాస్త్ర, సాంకేతిక రంగాలే దేశాన్ని శాసిస్తున్నాయని స్పష్టంచేశారు. పస్తుతం భాషల విషయంలో జరుగుతున్న ఘర్షణలు బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు.