తనకు చిన్నతనంలో విద్యాబుద్దులు నేర్పిన టీచర్ ను ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్ కలిశారు. స్కూల్ రోజుల్లోని ఘటనలను గుర్తు చేసుకున్నారు.
తిరువనంతపురం: భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధంకర్ చిన్నతనంలో తనకు పాఠాలు చెప్పిన టీచర్ ను కలుసుకున్నారు. దశాబ్దాల తర్వాత తన వద్ద విద్యాబుద్దులు నేర్చుకున్న శిష్యుడిని చూసి రత్న టీచర్ ఆనందం వ్యక్తం చేశారు.
ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్ , ఆయన సతీమణి సుధేష్ ధంకర్ కేరళ రాష్ట్రంలోని పానూరులోని రత్న టీచర్ నివాసానికి సోమవారం నాడు వెళ్లారు. సుధీర్ఘకాలం పాటు సైనిక్ స్కూల్ లో రత్న టీచర్ గా పనిచేశాడు. ఉద్యోగం నుండి రిటైరైన తర్వాత సానూరులోని సోదరుడిని నివాసంలో ఆమె ఉంటున్నారు. చాలా ఏళ్ల తర్వాత తనవద్ద పాఠాలు నేర్చుకున్న శిష్యుడు జగదీప్ ధంకర్ తన వద్దకు రావడం పట్ట ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఇంతకంటే గొప్ప గురుదక్షిణ ఏముంటుందని ఆమె వ్యాఖ్యానించారు.
స్కూల్ రోజులను ఉప రాష్ట్రపతి జగదీప్ ధంకర్ , రత్న టీచర్ లు గుర్తు చేసుకున్నారు. క్లాస్ రూమ్ లో తన ముందు కూర్చుని క్రమశిక్షణతో పాఠాలు వినేవారని రత్న టీచర్ ఈ సందర్భంగా జగదీప్ గురించి చెప్పారు. క్రమశిక్షణతో పాటు ప్రతి విషయంలో జగదీప్ ధంకర్ యాక్టివ్ గా ఉండేవారని టీచర్ రత్న తెలిపారు. పాఠ్యాంశాలతో పాటు క్రీడలు ఇతర విషయాల్లో కూడా జగదీప్ ఆసక్తిని కనబర్చేవారని రత్న టీచర్ వివరించారు. చిత్తోర్‌గ్రా సైనిక బోర్డింగ్ స్కూల్ విద్యార్ధులు 9 నెలల పాటు టీచర్లతోనే ఉంటారు. దీంతో ఉపాధ్యాయులు, విద్యార్ధుల మధ్య మంచి అనుబంధం ఉంటుంది. ప్రతి నెల జగదీప్ ధంకర్ తల్లిదండ్రులు స్కూల్ కు వచ్చేవారని రత్న టీచర్ గుర్తు చేసుకున్నారు.
తన ఇంటికి వచ్చిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్ కు కుటుంబ సభ్యులతో కలిసి రత్న టీచర్ ఘనంగా స్వాగతం పలికారు. అరటిపండుతో చేసిన చిప్స్ , ఇడ్లీని ఉపరాష్ట్రపతి తిన్నారు. ఉపరాష్ట్రపతి వెంట స్పీకర్ ఎన్ శ్యాంసీర్ కూడా ఉన్నారు.
రాజస్థాన్ లోని చిత్తోర్ గ్రా సైనిక్ స్కూల్ లో జగదీప్ ధంకర్ చదివే సమయంలో రత్న టీచర్ గా పనిచేశారు. 18 ఏళ్ళ పాటు రత్న టీచర్ సైనిక్ స్కూల్ లో పనిచేశారు. అనంతరం కన్నూరులోని నవోదయ స్కూల్ లో ప్రిన్సిపాల్ గా పనిచేసి రిటైరయ్యారు.

తన వద్ద విద్యనభ్యసించిన విద్యార్ధి జగదీప్ ధంకర్ ను చూసేందుకు టీచర్ రత్న ఎంతో ఆసక్తిని చూపారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్ తో పాటు ఆయన సోదరుడికి కూడా రత్న టీచర్ పాఠాలు బోధించింది. 1968లో జగదీప్ ధంకర్ పన్నెండో తరగతిలో ఉత్తీర్ణత సాధించాడు. అయినా కూడా స్కూల్ లో ఉపాధ్యాయులతో సంబంధాలను కొనసాగించారు.. పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా జగదీప్ ధంకర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత రత్న టీచర్ కు ఫోన్ చేసి ఆమె ఆశీస్సులు కోరారు.
