ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం నుండి ఇప్పటివరకు ఎంతమంది ఎంపీలు ఓటు హక్కు వినియోగించుకున్నారో తెలుసా?
భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇవాళ ఉదయం 10 గంటల నుండి పార్లమెంట్ భవనంలో ఎంపీలు ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు... ఇలా ఇప్పటివరకు 70 శాతం పోలింగ్ నమోదయ్యింది. మొత్తం 781 మంది ఎంపీల్లో ఇప్పటివరకు 528 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది... 6 గంటల నుండి ఓట్ల లెక్కింపు చేపట్టి పలితం ప్రకటిస్తారు.
జగదీప్ ధన్కర్ రాజీనామాతో నూతన ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే ప్రక్రియను ఎన్నికల సంఘం ప్రారంభించింది. ఇందుకోసం నోటిఫికేషన్ జారీ చేయగా అధికార ఎన్డిఏ కూటమి సిపి రాధాకృష్ణన్ ను, ప్రతిపక్ష ఇండియా కూటమి రిటైర్డ్ సుప్రీంకోర్ట్ జడ్జ్ జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డిని పోటీలో నిలిపింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ ఇద్దరు దక్షిణ భారతదేశానికి చెందినవారే. వీరిలో సిపి రాధాకృష్ణన్ తమిళనాడు, జస్టిస్ సుదర్శన్ రెడ్డి తెలంగాణకు చెందినవారు. తెలుగు వ్యక్తి ఉపరాష్ట్రపతి బరిలో నిలవడంతో దేశ రాజకీయాలే కాదు తెలుగు పాలిటిక్స్ లో ఉత్కంఠ నెలకొంది.
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మొదటి ఓటు ప్రధాని నరేంద్ర మోదీ వేశారు... పోలింగ్ ప్రారంభంకాగానే ఆయన ఓటుహక్కును వినియోగించుకుని పంజాబ్ పర్యటనకు వెళ్ళారు. ఇక సోనియా గాంధీ తన ఇద్దరు బిడ్డలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో కలిసివచ్చి ఓటేశారు. వారివెంట ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే కూడా ఉన్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రులు, సీనియర్ ఎంపీలు ఓటుహక్కును వినియోగించుకున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలు కూడా ఓటేశారు. అయితే తెలంగాణకు చెందిన బిఆర్ఎస్ పార్టీ, ఒడిషాకు చెందిన బిజెపి, పంజాబ్ కు చెందిన అకాళీదళ్ ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉన్నారు.
