Vice President Elections 2025 : తెలుగు రాష్ట్రాల్లో ఏ పార్టీ సపోర్ట్ ఎవరికి?
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తెలుగు వ్యక్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి బరిలోకి దింపింది. ఈ క్రమంలో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లోని ఏ పార్టీ సపోర్ట్ ఎవరికి అనేది ఇక్కడ చూద్దాం.

నేడే ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్
Vice President Elections 2025 : భారతదేశానికి నూతన ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది... ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల, అభ్యర్థుల నామినేషన్ ముగిసింది. ఈ ఎన్నికల్లో అత్యంత కీలకమైన పోలింగ్ ప్రక్రియ నేడు (సెప్టెంబర్ 09, మంగళవారం) జరగనుంది. పార్లమెంట్ భవనంలో ఉదయం 10 గంటలకు పోలింగ్ ప్రారంభం అవుతుంది... సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. ఆ వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టి గెలుపు ఎవరిదో ప్రకటిస్తారు... దీంతో కొత్త ఉపరాష్ట్రపతి ఎవరనేది తేలిపోతుంది.
జస్టిస్ సుదర్శన్ రెడ్డి VS సిపి రాధాకృష్ణన్
జగదీప్ దన్కడ్ రాజీనామాతో ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యం అయ్యింది. దీంతో అధికార ఎన్డిఏ కూటమి సిపి రాధాకృష్ణన్ ను బరిలోకి దింపి ఏకగ్రీవానికి ప్రయత్నించింది. కానీ ప్రతిపక్ష ఇండియా కూటమి పోటీకి సై అనడంతో ఎన్నికలు తప్పడంలేదు. అయితే కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి తెలుగు రాష్ట్రానికి చెందిన రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డిని తమ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో దేశ రాజకీయాలే కాదు తెలుగు రాష్ట్రాల రాజకీయాలు రసవత్తరంగా మారాయి.
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తెలుగు సెంటిమెంట్..
ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పలువురు కాంగ్రెస్ నాయకులు తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని చాటే సమయం వచ్చిందని... పార్టీలకు అతీతంగా తెలుగువ్యక్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఓటు వేయాలని కోరుతున్నారు. చాలాకాలం తర్వాత ఓ తెలుగు వ్యక్తికి దేశంలోని అత్యున్నత పదవుల్లో ఒకటైన ఉపరాష్ట్రపతి దక్కే అవకాశం వచ్చింది... కాబట్టి తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలన్ని ఒక్కటి కావాల్సిన అవసరం ఉందంటున్నారు. రాజకీయాల సంబంధంలేని జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఓటేయాలని కోరుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లోని రాజకీయ పార్టీలు ఎటువైపు నిలుస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. మరి ఏ పార్టీ ఎవరికి మద్దతిస్తుందో తెలుసుకుందాం.
తెలంగాణలో ఏ పార్టీ ఎవరికి మద్దతు
కాంగ్రెస్ పార్టీ మద్దతు బి సుదర్శన్ రెడ్డికే
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తెలుగు వ్యక్తి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డిని బరిలోకి దింపిందే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఆయనకే తెలంగాణ కాంగ్రెస్ లోక్ సభ, రాజ్యసభ ఎంపీలు ఓటు వేయనున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఇప్పటికే ఎంపీలంతా డిల్లీకి చేరుకున్నారు... సీఎం రేవంత్ రెడ్డి కూడా అక్కడే ఉన్నారు. కేవలం కాంగ్రెస్ మాత్రమే తెలుగు ఎంపీలంతా జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతివ్వాలని కాంగ్రెస్ కోరుతోంది.
బిఆర్ఎస్ మద్దతు ఎవరికి?
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి తటస్ధ వైఖరి అవలంభిస్తోంది. అంటే అటు ఎన్డిఏ అభ్యర్థికిగాని, ఇటు ఇండియా కూటమి అభ్యర్థికిగాని మద్దతు ఇవ్వకూడదని నిర్ణయించింది. వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో నోటా ఉండదు కాబట్టి ఈ పోలింగ్ లో పాల్గొనకూడదని బిఆర్ఎస్ నిర్ణయించింది... ఈ మేరకు ఎంపీలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. బిఆర్ఎస్ కు లోక్ సభలో ఎంపీలు లేకున్నా రాజ్యసభలో నలుగురు ఎంపీలు ఉన్నారు.
బిజెపి మద్దతు సిపి రాధాకృష్ణన్ కే
తెలంగాణలో బిజెపికి 8 మంది ఎంపీల బలం ఉంది. వీరంతా తమ పార్టీ అదిష్టానం నిర్ణయించిన అభ్యర్ధికి సిపి రాధాకృష్ణన్ కే ఓటు వేయనున్నారు. ఇప్పటికే ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసం బిజెపి ఎంపీలంతా డిల్లీకి చేరుకున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ లో ఏ పార్టీ మద్దతు ఎవరికి...
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ ఎంపీల ఓట్లన్ని వన్ సైడ్ పడనున్నాయి. అధికార కూటమి పార్టీలు తెలుగుదేశం, జనసేనతలు బిజెపితో కలిసి ఎన్డిఏ కూటమిలో భాగస్వాములుగా ఉన్నాయి. కాబట్టి ఈ మూడు పార్టీల ఎంపీలు ఎన్డిఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ కే ఓటేస్తాయి. కాంగ్రెస్ తెలుగు సెంటిమెంట్ తీసుకువచ్చినా తాము ఎన్డిఏ అభ్యర్థికే మద్దతిస్తున్నట్లు ఏపీ సీఎం, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రకటించారు... స్వయంగా ఆయన ఉపరాష్ట్రపతి అభ్యర్ధి రాధాకృష్ణన్ ను కలిసి మద్దతు తెలిపారు.
ఇక ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్డిఏ అభ్యర్థికే మద్దతు ప్రకటించింది. తెలుగు వ్యక్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి బరిలో నిలిచినా తమ సపోర్ట్ ఎన్డిఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ కే అని వైసిపి స్పష్టం చేసింది... తమ ఎంపీలు ఈయనకే ఓటు వేస్తారని ప్రకటించింది. ఇలా ఏపీలోని అందరు ఎంపీలు ఒకేవైపు ఓటు వేయనున్నారు.
మొత్తంగా ఇరు తెలుగు రాష్ట్రాల్లో కేవలం కాంగ్రెస్ ఎంపీలు మినహా మిగతా పార్టీల ఎంపీలంతా ఎన్డిఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ కే ఓటేయనున్నారు. అయితే హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసి ఎన్డిఏకు మద్దతిచ్చే అవకాశాలు లేవు... కాబట్టి ఆయన ఇండియా కూటమి అభ్యర్థికి ఓటేయవచ్చు.