కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుతో బజరంగ్ దళ్ పై నిషేధాంశం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే వీహెచ్‌పీ జనరల్ సెక్రెటరీ మిలింద్ పరాండే స్పందించారు. బజరంగ్ దళ్ పై నిషేధం విధిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన సంగతి తెలిసిందే. ఎన్నికల క్యాంపెయిన్‌లో కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో బజరంగ్ దళ్, పీఎఫ్ఐ వంటి విద్వేషాన్ని వెదజల్లే సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. అవసరమైతే వాటిపై బ్యాన్ కూడా విధిస్తామని తెలిపింది. అనంతరం, బజరంగ్ దళ్ బ్యాన్ ఆ తర్వాత ఎన్నికల ప్రచారం కీలక అంశంగా మారిపోయింది. ప్రధాని మోడీ సహా బీజేపీ నేతలు బజరంగ్ దళ్ బ్యాన్ అనే అంశంపై ఫోకస్ పెట్టారు. ఎన్నికల్లో ఓటేసేటప్పుడు జై భజరంగ్ భళి అని నినదించి ఓటేయాలని మోడీ సూచించారు. 

అయితే, చివరకు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే గెలిచింది. దీంతో కాంగ్రెస్ పార్టీ తన మ్యానిఫెస్టోలో పేర్కొన్న అంశాలపై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలోనే బజరంగ్ దళ్ నిషేధాంశంపై విశ్వ హిందు పరిషద్ నేత స్పందించారు. వీహెచ్‌పీ జనరల్ సెక్రెటరీ మిలింద్ పరాండే తాజాగా స్పందిస్తూ.. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ప్రతిపాదించిన నిషేధం బెదిరింపులకు బజరంగ్ దళ్ భయపడదని స్పష్టం చేశారు.

Also Read: కాలేజ్ ఎగ్జామ్‌లో ఫెయిల్.. తల్లిదండ్రులకు భయపడి కిడ్నాప్ ప్లాన్ వేసిన బాలిక.. ఎలా దొరికిందంటే?

హిందువులపై ద్వేషంతో ఒక వేళ వారు బజరంగ్ దళ్‌ను బ్యాన్ చేస్తే అవసరమైన చర్యలు తాము తీసుకుంటామని పరాండే అన్నారు. రామ జన్మ భూమి ఉద్యమ సమయంలోనూ బజరంగ్ దళ్‌ను నిషేధించారని గుర్తు చేశారు. అయితే, అది తప్పు అంటూ దానిపై నిషేధాన్ని కోర్టు ఎత్తేసిందని పేర్కొన్నారు.