పశువుకు వైద్యం చేయాల్సి ఉన్నదని వెటర్నరీ వైద్యుడిని ఇంటికి పిలిచి కిడ్నాప్ చేశారు. తేరుకునేలోపు అతడిని పెళ్లి కొడుకు చేశారు. సిద్ధంగా ఉన్న పెళ్లి కుమార్తెకు ఇచ్చి పెళ్లి చేశారు. ఈ ఘటన బిహార్‌లోని బెగుసరాయ్‌లో చోటుచేసుకుంది. విషయం తెలిసిన పెళ్లి కొడుకు కుటుంబం పోలీసులను ఆశ్రయించింది.
పాట్నా: బిహార్‌లో మరోసారి బలవంతపు పెళ్లి జరిగింది. పశువుకు వైద్యం చేయాలని ఓ వెటర్నరీ వైద్యుడికి ఫిర్యాదు చేశారు. ఇంటికి వచ్చి వైద్యం చేయాల్సిందిగా కోరారు. ఈ విషయాన్ని నమ్మి వైద్యం చేయడానికి ఆ వెటర్నరీ డాక్టర్ ఇంటికి వెళ్లాడు. వెళ్లగానే ముగ్గురు వ్యక్తులు వెటర్నరీ డాక్టర్‌ను కిడ్నాప్ చేశారు. అసలేం జరుగుతుందో ఏమో తెలుసుకునే లోపే ఆ వెటర్నరీ డాక్టర్‌ను పెళ్లి కొడుకును చేసి సిద్ధంగా ఉన్న పెళ్లి కుమార్తెతో పెళ్లి జరిపించారు. బిహార్‌లోని బెగుసరాయ్‌లో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
తెగ్రా పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన సత్యమ్ కుమార్ వెటర్నరీ వైద్యుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఆయనను పొరుగు ఊరి నుంచి కొందరు తమ ఇంటికి రమ్మన్నారు. పశువు అనారోగ్యంగా ఉన్నదని, దానికి ట్రీట్‌మెంట్ చేయాలని నమ్మబలికారు. ఇది నిజమేనని నమ్మిన సత్యమ్ కుమార్ ఆ ఊరికి వెళ్లాడు. వెళ్లగానే సత్యమ్ కుమార్‌ను ముగ్గురు దుండగులు కిడ్నాప్ చేశారు. అనంతరం, అక్కడే సిద్ధంగా ఉన్న పెళ్లి కుమార్తెతో పెళ్లి జరిపించారు.
ఈ ఘటనపై సత్యమ్ కుమార్ కుటుంబం తీవ్ర ఆందోళనలో పడింది. సత్యమ్ కుమార్‌కు జూన్ 14న మధ్యాహ్నం 12 గంటల సమయంలో కాల్ చేశారని, అనారోగ్యం బారిన పడిన పశువుకు చికిత్స చేయడానికి రమ్మన్నారని సత్యమ్ కుమార్ బంధువు ఒకరు తెలిపారు. అక్కడికి వెళ్లిన తర్వాత ముగ్గురు దుండగులు అతన్ని కిడ్నాప్ చేశారని వివరించారు. దీంతో తామంతా ఒక్కసారుగా ఖంగారు పడ్డామని, అందరమూ పోలీసు స్టేషన్‌కు వెళ్లామని తెలిపారు.
సత్యమ్ కుమార్ తండ్రి పోలీసు స్టేషన్‌లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. బెగుసరాయ్ ఎస్పీ యోగేంద్ర కుమార్ మాట్లాడుతూ, సత్యమ్ కుమార్ తండ్రి స్థానిక పోలీసులను ఆశ్రయించాడని, ఘటనకు సంబంధించి ఫిర్యాదు అందించారని వివరించారు. ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు చేపట్టాలని స్టేషన్ హౌజ్ ఆఫీసర్, ఇతర అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
వరుడిని కిడ్నాప్ చేసే వివాహాలు..
బిహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్‌లలో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ ఇలాంటి వివాహాలు జరుగుతాయి. వీటిని స్థానికంగా పకడ్వా వివాహ్ అంటారు. ఈ సాంప్రదాయం ప్రకారం, ఆర్థికంగా వెసులుబాటు ఉండి, సామాజిక భద్రత గల కుటుంబాన్ని ఎంచుకుని, ఉద్యోగం ఉన్న యువకులను టార్గెట్ చేసి కిడ్నాప్ చేస్తుంటారు. కిడ్నాప్ చేసిన వెంటనే తమ కుటుంబంలోని ఆడ పిల్లకు ఇచ్చి పెళ్లి చేస్తుంటారు. కిడ్నాప్ చేయడంతోపాటు పెళ్లికి కూడా సమాంతరంగా ప్లాన్ చేస్తారు. యువకుడిని కిడ్నాప్ చేసిన స్వల్ప వ్యవధిలోనే ఆడ పిల్లతో పెళ్లి చేసి విడిచిపెడతారు.
బిహార్‌లో గతేడాది కూడా ఇలాంటి ఓ ఘటనే మీడియాకు ఎక్కిది. బొకార స్టీల్ ప్లాంట్‌లో జూనియర్ మేనేజర్‌గా పని చేస్తున్న అప్పుడు 29 ఏళ్ల వినోద్ కుమార్ అనే యువకుడిని పాట్నాలలోని పండరక్ ఏరియాకు చెందిన దుండగులు తీవ్రంగా దాడి చేశారు. పెళ్లి చేశారు. పెళ్లి తంతును ఆపాలని వారిని వినోద్ కుమార్ వేడుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
