సీపీఐ(ఎం) సీనియర్ నేత, కేరళ మాజీ హోంమంత్రి కొడియేరి బాలకృష్ణన్‌ కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి 8:30 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. 

సీపీఐ(ఎం) సీనియర్ నేత, కేరళ మాజీ హోంమంత్రి కొడియేరి బాలకృష్ణన్ (69) కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. బాలకృష్ణన్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఇటీవల చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. అతను 2019 లో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. గ‌తంలో యుఎస్ఏ కూడా చికిత్స పొందాడు. చికిత్స పొందుతూ.. శనివారం రాత్రి 8:30 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు.

పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బాలకృష్ణన్ 2006 నుంచి 2011 వరకు వీఎస్ అచ్యుతానంద ప్రభుత్వంలో హోం మరియు టూరిజం వ్యవహారాల మంత్రిగాగా పనిచేశారు. అనంత‌రం.. 2015 నుంచి 2022 వరకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. మ‌ధ్య‌లో ప‌లు కార‌ణాల‌తో రాష్ట్ర కార్యదర్శి ప‌ద‌వికి దూరంగా కాగా.. ఆ తర్వాత పార్టీ సీనియర్‌ నేత, ఎల్‌డిఎఫ్‌ కన్వీనర్‌ ఎ విజయరాఘవన్‌ రాష్ట్ర తాత్కాలిక కార్యదర్శిగా నియమితులయ్యారు.

మే 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత సీపీఐ(ఎం) రాష్ట్రంలో అధికారాన్ని నిలబెట్టుకుంది. డిసెంబర్ 2021లో బాలకృష్ణన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా తిరిగి వచ్చారు. ఇటీవ‌ల త‌న‌ ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఆగస్టు చివరి వారంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు. బాలకృష్ణన్‌ మృతి సిపిఎంకి, వామపక్ష ఉద్యమానికి తీరని లోటని కేరళ రాష్ట్ర కమిటీ తెలిపింది. ఆయ‌న‌ మృతికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసింది.

కేరళ అసెంబ్లీ స్పీకర్ ఏఎన్ షంసీర్.. దివంగత నేత బాలకృష్ణన్‌ చిత్రాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆయన మన హృదయాలను ఎప్పటికీ వదిలిపెట్టరని అన్నారు. వీడ్కోలు ప్రియమైన బాలకృష్ణన్ అని ట్విట్ చేశారు. 

కాగా, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆదివారం యూరప్ పర్యటనకు వెళ్లాల్సి ఉండ‌గా.. బాలకృష్ణన్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అంతకుముందు రోజు ఆయ‌న తన పర్యటనను వాయిదా వేసుకున్నారు.

కొడియేరి బాలకృష్ణన్ ఎవ‌రు? 

నవంబర్ 16, 1953లో జన్మించిన కొడియేరి బాలకృష్ణన్ తన విద్యను కొడియేరి ఒనియన్ హైస్కూల్, మహాత్మా గాంధీ కళాశాల, మహే యూనివర్సిటీ కళాశాల త్రివేండ్రంలో పూర్తి చేశారు. సిపిఐ (ఎం) విద్యార్థి విభాగం ద్వారా మహేలోని మహాత్మాగాంధీ కళాశాలలో చదువుతున్నప్పుడే రాజకీయాల్లో క్రియాశీలకంగా మారారు. అతను SFI కేరళ రాష్ట్ర కమిటీకి కార్యదర్శి గాను.. ఆల్ ఇండియా జాయింట్ సెక్రటరీగానూ ప‌ని చేశారు.1980ల ప్రారంభంలో డివైఎఫ్‌ఐ కన్నూర్ జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఎమర్జెన్సీ సమయంలో 16 నెలల పాటు జైలు జీవితం గడిపారు. ఆయ‌న‌ SR వినోదినిని వివాహం చేసుకున్నాడు. వారి ఇద్ద‌రు పిల్ల‌లు బినోయ్ కొడియేరి, బినీష్ కొడియేరి .