Asianet News TeluguAsianet News Telugu

పాము పగపట్టిందా?!.. ఒకే యువకుడిని, ఒకే చోట 5సార్లు కాటేసిన విషసర్పం...!

ఉత్తరప్రదేశ్ లో ఓ విచిత్ర ఘటన జరిగింది. ఓ పాము ఓ వ్యక్తిని.. ఒకే చోట ఐదుసార్లు కాటేసింది. అది కూడా పది రోజుల్లో ఐదు సార్లు.. వెంటాడి వెంటాడి కాటేసింది. 

venomous snake bitesyoung man 5 times in one place Uttar Pradesh
Author
First Published Sep 17, 2022, 7:29 AM IST

ఉత్తరప్రదేశ్ : ఒకే యువకుడిని 10 రోజుల్లో ఐదుసార్లు ఓ విషసర్పం కాటేసింది. దీంతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా జిల్లాలో ఇది చర్చనీయాంశంగా మారింది. మల్ పురా ప్రాంతంలోని మన్ కేఢా గ్రామానికి చెందిన ఇరవై ఏళ్ల రజత్ చాహర్ పదేపదే పాముకాటుకు గురవుతున్నాడు. అయితే, కాటేసిన ప్రతిసారి సమయానికి వైద్యం అందడంతో అతడు ఆరోగ్యంగానే ఉన్నాడు.  కానీ ఎప్పుడు ఏం జరుగుతుందో అని కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. రామ్ కుమార్ చాహర్ కొడుకైన రజత్ చాహర్ డిగ్రీ చదువుతున్నాడు. ఈనెల 6వ తేదీ రాత్రి 9గంటలకు ఇంటి బయట నడుస్తుండగా.. ఓ పాము ఎడమ కాలిపై కాటేసింది. 

భయంతో  కేకలు వేయగా, ఇంట్లో వాళ్ళు వచ్చేసరికి పాము అక్కడి నుంచి పారిపోయింది. వెంటనే రజత్ ను హుటాహుటిన ఆగ్రా లోని ఎస్.ఎన్. వైద్య కళాశాల ఆస్పత్రిలో చేర్పించారు. పరీక్షించిన వైద్యులు పాముకాటు లక్షణాలేవీ కనిపించడం లేదని ఇంటికి పంపేశారు. మళ్లీ 8వ తేదీ సాయంత్రం.. ఇంటి ఆవరణలో ఉన్న స్నానాల గదికి వెళ్ళాడు.. అక్కడే ఉన్న పాము మరోమారు ఎడమ కాలిపై కాటేసింది.ఈసారి ముబారక్ పూర్ తీసుకు వెళ్లి వైద్యం చేయించారు. ఇదేవిధంగా 11, 13,14 తేదీల్లో రజత్ ను పాము కరిచింది. ఎందుకు తనని వెంటాడుతుందో, ఒకే చోట కాటేయడం ఏమిటో తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. 

మనిషి పగ... కాటేసిందని పామును కొరికి, కొరికి చంపి, మెడలో వేసుకుని.. ఊరంతా ఊరేగి..

కాగా, కామారెడ్డిలో ఈ జులైలో ఇలాగే ఓ విద్యార్థిని పాము మూడుసార్లు కాటేసింది. పాములు పగ బడతాయా? అదేమో తెలియదు కానీ.. ఓ విద్యార్థి మాత్రం ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా మూడుసార్లు వరుసగా మూడుసార్లు పాము కాటుకు గురయ్యాడు. కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ లోని జెడ్పీ పాఠశాలలో తొమ్మిదో తరగతి విద్యార్థి బర్ధవాల్ కృష్ణను ఓ పాము కాటు వేసింది. వెంటనే టీచర్లు అతడిని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేయించారు. ఆ తరువాత మెరుగైన చికిత్స కోసం బాన్సువాడ ఆస్పత్రికి తరలించారు. 

అయితే కృష్ణను పాము కాటు వేయడం ఇది మొదటి సారి కాదు అని తేలింది. పెద్ద కొడప్ గల్ మండలంలోని చావుని తండాకు చెందిన కృష్ణకు పాము కాటు వేయడం ఇది మూడోసారి. జూన్ 23న కూడా పెద్ద కొడప్ గల్ లోని బాలుర సంక్షేమ హాస్టల్ లో ఇదే విద్యార్తఇకి పాము కాటు వేసింది. గతంలోనూ ఒక ప్రైవేటు స్కూల్ లో కృష్ణను పాము కరిచినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. 

ఇదిలా ఉండగా, సెప్టెంబర్ 12న ఆదిలాబాద్ జిల్లాలో పాము కాటుతో ఇద్దరు చిన్నారులు మృతి చెందిన విషాద ఘటనే చోటు చేసుకుంది. పూరిగుడిసెలో నివాసం ఉంటున్న ఓ కుటుంబంలోని ఇద్దరు పిల్లలను పాము కాటు వేసింది. వెంటనే ఆస్పత్రికి తరలించినా.. దారి సరిగా లేకపోవడంతో అష్టకష్టాలు పడుతూ చికిత్సకోసం ఆసుపత్రికి వెళ్లినా..  ఆ చిన్నారులను బతికించుకోలేపోయారు. ఈ విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం మారుతిగూడ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మారుతిగూడకు చెందిన కవితాబాయికి, ఆత్రం రాజుతో 18 ఏళ్ల కిందట వివాహమైంది. 

భర్తతో గొడవల కారణంగా రెండేళ్లుగా తన ఏడుగురు పిల్లలతో పుట్టింట్లోనే ఉంటూ కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. 
కవితాబాయి తన పిల్లలతో ఆ రాత్రి గుడిసెలో నిద్రిస్తుండగా.. రాత్రి రెండు గంటల ప్రాంతంలో ఇంట్లోకొచ్చిన పాము భీంరావు (13), దీప (4)ను కాటు వేసింది. దీంతో పిల్లలు ఒక్కసారిగా కేకలు వేయడంతో కవిత బాయి మేల్కొంది. చూసేసరికి అప్పటికే పిల్లలను కాటేసిన నాగుపాము అక్కడినుంచి వెళ్లిపోయింది. వెంటనే ఈ విషయాన్ని కవితాబాయి చుట్టుపక్కల వారికి తెలపడంతో..  స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు. వాహనం వచ్చి.. వారిని ఆస్పత్రికి తీసుకు వెళుతుండగా మార్గమధ్యంలోనే అన్నాచెల్లెళ్లు ప్రాణాలు వదిలారు. 

Follow Us:
Download App:
  • android
  • ios