ఢిల్లీ: 
భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన వారిపై అనర్హత వేటు వెయ్యడమే తన అభిమతమని స్పష్టం చేశారు. ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా తన నివాసంలో వెంకయ్యనాయుడు ఆత్మీయ విందు ఇచ్చారు . ఈ సందర్భంగా  తన మనసులోని మాటలను పంచుకున్నారు. పనిచేస్తూనే తాను ఎంజాయ్ చేస్తానన్నారు. క్రమ శిక్షణ, సమయ పాలన నిక్కచ్చిగా పాటిస్తానని తెలిపారు. ప్రోటోకాల్ కారణంగా ప్రజలను కలవడం ఇబ్బందిగా ఉందన్నారు. 

మరోవైపు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమైన పార్టీ ఫిరాయింపుల అంశంపై తనదైన శైలిలో స్పందించారు.  పార్టీ మారిన వారిపై అనర్హత వేటు వెయ్యాలన్నది తన అభిమతం అన్నారు. పార్టీ ఫిరాయింపులు అనైతికమని కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే చెప్పినట్లు గుర్తు చేశారు.  ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ సమక్షంలోనే పార్టీ ఫిరాయింపులపై తన నిర్ణయాన్ని స్పష్టం చేశానన్నారు.  

రాజ్యసభ చైర్మన్ గా అనర్హత పిటీషన్ పై వెంటనే చర్యలుతీసుకున్నానని అయితే లోక్ సభ, అసెంబ్లీ స్పీకర్లు అలాగే వ్యవహరిస్తారని భావించానన్నారు. అటు సభలో సభ్యులు కనీస మర్యాదలు కూడా పాటించడం లేదన్నారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షం, ప్రతిస్పందించే అధికార పక్షం ఉంటే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందన్నారు.