బహ్రెయిన్‌లోని ఓ ఇండియన్ రెస్టారెంట్ సిబ్బంది.. ముఖంపై వస్త్రాన్ని కప్పుకున్న మహిళను అడ్డుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన ఆ దేశ అధికారులు రెస్టారెంట్‌ను మూసేశారు. ఈ ఘటనకు తమ మేనేజర్  కారణమని, తమకు ఎవరిపైనా వివక్ష లేదని ఆ రెస్టారెంట్ క్షమాపణలు చెబుతూ సోషల్ మీడియాలో ఓ పోస్టు చేసింది. 

న్యూఢిల్లీ: అరబ్ కంట్రీ బహ్రెయిన్‌లో హిజాబ్ ధరించిన ఓ మహిళను ఒక భారత రెస్టారెంట్ సిబ్బంది అడ్డుకున్నారు. దీనిపై ఆ పర్యాటకులు సీరియస్ అయ్యారు. ఆమె వెంటనే ఉన్న మరో మహిళ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టు చేశారు. ముఖాన్ని వస్త్రంతో కప్పుకున్న మహిళను ఎందుకు అనుమతించరు? అని ప్రశ్నించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బహ్రెయిన్ టూరిజం అండ్ ఎగ్జిబిషన్ అథారిటీ వెంటనే రంగంలోకి దిగింది. ఘటనపై దర్యాప్తు జరిపింది. ఆ ఇండియన్ రెస్టారెంట్‌ను మూసేసింది. ఆ తర్వాత ఆ రెస్టారెంట్ యాజమాన్యం క్షమాపణలు చెబుతూ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టింది. ఈ ఘటన బహ్రెయిన్ రాజధాని మనామాకు సమీపంలోని అడ్లియాలోని ల్యాంతర్న్ ఇండియన్ రెస్టారెంట్‌లో చోటుచేసుకుంది. 

బహ్రెయిన్ టూరిజం అధికారులు ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. ప్రజలపై వివక్ష చూపే అన్ని రకాల చర్యలను తాము వ్యతిరేకిస్తామని పేర్కొన్నారు. ముఖ్యంగా దేశ అస్తిత్వాన్ని వ్యక్తీకరించే వాటిని అడ్డుకుంటే సహించబోమని స్పష్టం చేశారు. కాగా, లాంతర్న్ ఇండియ రెస్టారెంట్ ఈ ఘటనపై ఇలా స్పందించింది. ఈ అందమైన బహ్రెయిన్ కింగ్‌డమ్‌లో తమ రెస్టారెంట్ గత 35 ఏళ్లుగా ఇక్కడ సేవలు అందిస్తున్నదని, తమ రెస్టారెంట్‌కు అందరినీ స్వాగతిస్తున్నామని వివరించింది. ఇక్కడికి అందరూ కుటుంబ సమేతంగా విచ్చేయవచ్చని, తమ సొంతింటిలా ఫీల్ కావొచ్చని పేర్కొంది. ఆ ఘటనలో తమ రెస్టారెంట్ మేనేజర్‌దే తప్పు ఉన్నట్టుగా గ్రహించామని, ఆ మేనేజర్‌ను సస్పెండ్ చేసినట్టు వివరించింది. ఆ మేనేజర్‌ తమకు ప్రాతినిధ్యం వహించడని, తమ వైఖరిని వెల్లడించడని తెలిపింది. కాబట్టి, తాము అందరినీ సమానంగా చూస్తామని, ఒక శుభ సూచికగా బహ్రెయిన్ ప్యాట్రన్‌లు అందరినీ ఈ నెల 29వ తేదీన ఉచితంగా విందు ఆరగించడానికి ఆహ్వానిస్తున్నామని ఇన్‌స్టాగ్రామ్‌లోని ఆ రెస్టారెంట్ పేజీలో పోస్టు చేసింది.

Scroll to load tweet…

హిజాబ్ ధరించిన మహిళతో వెళ్లిన స్నేహితురాలు సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టు చేసింది. తన ఫ్రెండ్ ముఖంపై ఆచ్చాదనం కప్పుకున్నందుకు ఆ రెస్టారెంట్‌లోకి అనుమతించకపోవడంపై చాలా ఆశ్చర్యం వేసిందని పేర్కొంది. రెస్టారెంట్లు ఇలాంటి నిర్ణయాలను తీసుకోకపోవడం మంచిదని, ముఖ్యంగా ముస్లిం మెజారిటీ ఉన్న దేశంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోరాదని హితవు పలికింది. 

View post on Instagram

కర్ణాటకలో హిజాబ్ వివాదం రగులుతున్న తరుణంలో బహ్రెయిన్‌లో ఇలాంటి ఘటన వెలుగులోకి రావడం చర్చనీయాంశం అయింది. విద్యా సంస్థల తరగతి గదుల్లో హిజాబ్ ధరించడాన్ని నిషేధిస్తూ కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని కర్ణాటక హైకోర్టు కూడా సమర్థించింది. అయినప్పటికీ ఈ వివాదం సమసిపోలేదు. కర్ణాటక హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.