రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, ప్రముఖ వ్యాపార దిగ్గజం ముకేష్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలు కలకలం రేపాయి. ఆయన ఇంటికి సమీపంలో ఓ వాహనం పార్క్ చేసి కనపడింది. కాగా.. అందులో పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు.  ఈ వాహనాన్ని తొలుత అంబానీ భద్రతా సిబ్బంది గుర్తించారు. అనంతరం స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.

వారు వెంటనే అప్రమత్తమై... సదరు వాహనాన్ని పరిశీలించగా.. అందులో పేలుడు పదార్థాలు కనిపించడంతో షాకయ్యారు. వెంటనే బాంబు నిర్వీర్య బృందాలు అక్కడికి చేరుకొని తనిఖీ చేశాయి. 

అసలు ఆ వాహనాన్ని అక్కడ ఎవరు పార్క్ చేశారు లాంటి వివరాల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా.. సమీపంలోని సీసీ కెమేరాలను పరిశీలించినట్లు అధికారులు చెప్పారు. అర్థరాత్రి ఒంటి గంట సమయంలో ఆ కారును అక్కడ పార్క్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తం 20 జిలిటెన్ స్టిక్స్ గుర్తించారు. కారులో లోపల ఓ ఉత్తరాన్ని కూడా తాము గుర్తించామని చెప్పారు.

సదరు కారు రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా అది ఎవరిది అయ్యింటుందో తెలుసుకునే పనిలో పడినట్లు చెప్పారు.కాగా..ఈ కారులో జిలిటెన్ స్టిక్స్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారని మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ వెల్లడించారు. దీనిపై ముంబయి క్రైం బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు  చేస్తున్నారు. దర్యాప్తులో పూర్తి వివరాలు తెలుస్తాయని ఆయన అన్నారు.