Kerala: వైస్ ఛాన్సలర్లు రాజీనామా చేయాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి పినరయి విజయన్ సోమవారం విలేకరుల సమావేశంలో చెప్పారు. కేరళ రాష్ట్రంలో గవర్నర్ తనకు వ్యతిరేకంగా సామూహిక తిరుగుబాటును ఎదుర్కోవాల్సి ఉంటుందని కేరళ ముఖ్యమంత్రి అన్నారు. 

Kerela Vice Chancellors: కేర‌ళలో గ‌వ‌ర్న‌ర్ వ‌ర్సెస్ పిన‌ర‌యి విజ‌య‌న్ ప్ర‌భుత్వ మ‌ధ్య వివాదాలు క్ర‌మంగా పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే కేర‌ళ ప్ర‌భుత్వాన్ని షాక్ కు గురిచేసే విధంగా రాష్ట్రంలోని ప‌లు యూనివ‌ర్సిటీల‌కు చెందిన వైస్ చాన్స‌ల‌ర్ల‌ను రాజీనామా చేయాల‌ని గ‌వ‌ర్న‌ర్ ఆరీఫ్ మ‌హ‌మ్మ‌ద్ ఖాన్ ఆదేశాలు జారీ చేశారు. సోమ‌వారం ఉద‌యం 11.30 గంట‌ల వ‌ర‌కు స‌మ‌యం ఇచ్చారు. అయితే, ప‌లు విశ్వ‌విద్యాల‌యాల వైస్ ఛాన్సల‌ర్లు కేర‌ళ గ‌వ‌ర్న‌ర్ కు వ్య‌తిరేకంగా రాష్ట్ర హైకోర్టును ఆశ్ర‌యించారు. 

వర్సిటీ ఛాన్సలర్ హోదాలో గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ సోమవారం ఉదయం 11.30 గంటలకు రాజీనామా చేయాలని కోరిన వివిధ కేరళ విశ్వవిద్యాలయాల తొమ్మిది మంది వైస్ ఛాన్సలర్లు (వీసీలు) రాజీనామా చేయడానికి నిరాకరించారు. ఇదే స‌మ‌యంలో కేరళ గవర్నర్ ఆదేశాలను వ్యతిరేకిస్తూ వీసీలు కేరళ హైకోర్టును ఆశ్రయించారు. కేరళ గవర్నర్ ఆదివారం నాడు అపూర్వమైన చర్యలో రాష్ట్రంలోని తొమ్మిది మంది వైస్ ఛాన్సలర్‌లను తమ పదవులకు రాజీనామా చేయాలని ఆదేశించడం గమనించవచ్చు. ఎంపిక ప్రక్రియలో వైరుధ్యాల కారణంగా కేరళ టెక్నికల్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్‌ను పదవీ విరమణ చేయాల్సిందిగా సుప్రీం కోర్టు తీర్పు ఆధారంగా గవర్నర్ ఈ ఆదేశాలు జారీ చేశారు.

గవర్నర్ ఉత్తర్వులు లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. సోమవారం విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ మాట్లాడుతూ వైస్ ఛాన్సలర్లు రాజీనామా చేయాల్సిన అవసరం లేదని అన్నారు. కేరళ ముఖ్యమంత్రి కూడా రాష్ట్రంలో గవర్నర్ తనపై సామూహిక తిరుగుబాటును ఎదుర్కోవలసి ఉంటుందని అన్నారు. ఆయన తన అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారని, ‘ఆర్ఎస్ఎస్’ సాధనంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గవర్నర్ తనకు ఉన్న అధికారాల కంటే ఎక్కువ అధికారాలను ఉపయోగిస్తూ తన పదవిని దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. ‘‘వీసీల అధికారాలను ఆక్రమించడం అప్రజాస్వామికం. గవర్నర్ పదవి రాజ్యాంగ గౌరవాన్ని కాపాడటానికి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కదలడానికి కాదు. ఆయన ఆర్ఎస్ఎస్ కు ఒక టూల్ గా వ్యవహరిస్తున్నారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

వీసీలకు ప్రాథమిక న్యాయం కూడా లేకుండా పోయిందని ముఖ్యమంత్రి అన్నారు. “ఒక కింది స్థాయి అధికారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నప్పుడు కూడా, మొదట అతనిని వివరణ కోరతారు. వీసీలకు కూడా అలాంటి న్యాయం లేదా? అని ప్ర‌శ్నించారు. ఆర్థిక దుర్వినియోగం, దుష్ప్రవర్తన అనే రెండు కారణాలపై మాత్రమే వీసీని తొలగించవచ్చని ఆయన అన్నారు. “అలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు కూడా, సీనియర్ సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తి ఆరోపణలపై విచారణ జరపాలి. అభియోగాలు రుజువైతేనే వీసీని తొలగించగలం’’ అని ముఖ్యమంత్రి అన్నారు. గవర్నర్ ఆదేశాలపై స్పందించిన కన్నూర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ గోపీనాథ్ రవీంద్రన్ రాజీనామాకు నిరాకరించారు. ‘‘ఒక వీసీ రాజీనామా ఆర్థిక అవకతవకలు. చెడు ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది. వీటిలో ఏదీ ఇక్కడ జరగలేదు. ఇది బూటకపు ఆరోపణ’’ అని అన్నారు. కాగా, ఎంజీ యూనివర్సిటీ, కేయూఎఫ్‌ఓఎస్‌, కేటీయూ మినహా ఆరుగురు వీసీలు తాజా నివేదికల ప్రకారం గవర్నర్‌కు సమాధానమిస్తూ న్యాయ సలహా తీసుకున్న తర్వాతే ముందుకు వెళ్తామని చెప్పారు.