ఓ మాజీ పోలీసు అధికారి, ఆయన భార్య... కూతురి శవంతో.. నెల రోజుల పాటు సావాసం  చేశారు. ఏమిటిదని ప్రశ్నిస్తే... తమ కుమార్తె చనిపోలేదని.. కేవలం నిద్ర పోతోందని వారు చెప్పడం విశేషం.  ఈ వింత సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీర్జాపూర్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...యూపీకి చెందిన ఓ వ్యక్తి పోలీసు అధికారిగా విధులు నిర్వర్తించి రిటైర్ అయ్యారు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. గత కొంత కాలంగా వారి ఇంట్లో నుంచి భరించలేని దుర్వాసన వస్తోంది. ఆ వాసనను భరించలేని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు రిటైర్డ్ పోలీసు అధికారి ఇంట్లో సోదాలు చేయగా... వారికి కుళ్లిపోయిన ఓ శవం కనిపించింది.

ఆ శవం ఆయన కుమార్తెదిగా పోలీసులు గుర్తించారు. అప్పటికే చనిపోయి నెల రోజులు కావస్తోందని పోలీసులు తెలిపారు. కాగా... దీనిపై రిటైర్డ్ పోలీసు అధికారి, ఆయన భార్యను ప్రశ్నించగా... వింత సమాధానాలు  చెప్పడం విశేషం.తమ కూతురు చనిపోలేదని, నిద్రపోతుందని సమాధానం చెప్పడంతో పోలీసులు నిర్ఘాంతపోయారు. అంతే కాకుండా తామంతా కలిసే ఉన్నామని, తమ ఇంట్లో ఎలాంటి దుర్వాసన రావడం లేదని పిచ్చి పిచ్చి సమాధానాలు ఇచ్చారు. 

వారి సమాధానాలపై అనుమానం వచ్చి ఈ విషయంపై చుట్టుపక్కలవారిని ప్రశ్నించగా..ఆ దంపతులు మానసిక రుగ్మతతో బాధపడుతున్నారని, ఎవరితో సరిగా మాట్లాడేవారు కాదని చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకి తరలించారు. మానసిక రుగ్మతతో బాధపడుతున్న దంపతులు అనుకోకుండా తమ కూతురిని హత్య చేసి ఉండవచ్చని, పోస్ట్‌మార్టం రిపోర్టు వచ్చాక పూర్తి దర్యాప్తు చేపడతామని పోలీసులు పేర్కొన్నారు.