జ్ఞానవాపి మసీదు: ఎఎస్ఐ సర్వేకు వారణాసి కోర్టు అనుమతి
జ్ఞానవాపి మసీదులో ఎఎస్ఐ సర్వేకు వారణాసి కోర్టు అనుమతిని ఇచ్చింది.

న్యూఢిల్లీ:జ్ఞానవాపి మసీదు ప్రాంగణాన్ని సర్వే చేసేందుకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి వారణిసి కోర్టు శుక్రవారం నాడు అనుమతిని ఇచ్చింది.అయితే శివలింగాన్ని పోలి ఉండే ప్రాంతాన్ని సర్వే పరిధి నుండి తప్పించాలని కోర్టు సూచించింది. ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా జ్ఞానవాపి మసీదు ప్రాంగణాన్ని శాస్త్రీయంగా సర్వే చేయాలని కోరుతూ హిందూ పక్షం దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు విచారించింది. ఈ పిటిషన్ పై వాదనలను ఈ నెల 14న పూర్తయ్యాయి.
జ్ఞానవాపి మసీదు వెలుపలి గోడపై శృంగార గౌరీ, గణేష్, హనుమాన్, నంది దేవతలను ప్రతి రోజూ పూజించేందుకు అనుమతిని కోరుతూ ఐదుగురు మహిళలు ఈ ఏడాది మే మాసంలో పిటిషన్ దాఖలు చేశారు.
అయితే ఈ పిటిషన్ పై విచారణ సమయంలో ఎఎస్ఐ సర్వేను హిందూ పక్షం అభ్యర్థించింది. అయితే ఈ అభ్యర్థనను మసీదు కమిటీ వ్యతిరేకించింది. ఆదివిశ్వేశ్వర ఆలయాన్ని ఆక్రమించి ధ్వంసం చేశారని హిందూ పక్షం వాదించింది. రాజాతొండల్ మాల్ ఇదే స్థలంలో 1580 ఏడీ లో ఆలయాన్ని పునరుద్దరించడాని హిందూ పక్షం వాదనను కూడ ముస్లిం పక్షం తోసిపుచ్చింది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు క్రూరమైనవాడు కాదని మసీదు కమిటీ పేర్కొంది. వారణాసిలో విశ్వేశ్వరాలయాన్ని కూల్చివేయలేదని మసీదు కమిటీ పేర్కొంది.
జ్ఞానవాపి మసీదు ఆవరణలో గత ఏడాది శివలింగం ఏదీ కనుగొనబడలేదని... ఆ వస్తువు ఫౌంటెన్ అని మసీదు కమిటీ ఆ ధరఖాస్తులో పేర్కోంది. ఈ ఏడాది మే 16న కాశీ విశ్వనాథ దేవాలయం జ్ఞానవాపి మసీదుకు సంబంధించిన వీడియోగ్రాఫిక్ సర్వే పూర్తైంది. సర్వే ప్రక్రియలో శివలింగం రూపంలో నిర్మాణం మసీదులో ఉందని హిందూ పక్షం వాదిస్తుంది.
మసీదులో నమాజ్ చేయడానికి ముందు అభ్యంగన స్నానం చేయడానికి వాటర్ ఫౌంటెన్ ఏర్పాటు చేసినట్టుగా ముస్లిం పక్షం పేర్కొంది. ఈ అంశంపై తదుపరి విచారణ జరిగే వరకు శివలింగంపై కార్బన్ డేటింగ్ నిర్వహించవద్దని ఈ ఏడాది మే 19న సుప్రీంకోర్టు పురావస్తు శాఖను ఆదేశించింది.