వాలంటైన్స్ డే రోజు ప్రేమికులు సరదాగా గడపాలనే కోరిక ఉంటుంది. దానికి తగ్గట్టు వాళ్లు ప్లానింగ్స్ కూడా చేసుకుంటారు. పార్కులకో, రెస్టారెంట్ లకో, సినిమాలకో వెళ్లి సరదాగా గడపాలని అనుకుంటారు. అయితే... భజరంగదళ్ లాంటి కొన్ని సంఘాల వల్ల ప్రేమికులు ఆరోజు బయట తిరగడానికి కూడా భయపడిపోతున్నారు.

ఎక్కడ బలవంతంగా పెళ్లిళ్లు చేస్తారో అనే కారణంతోనే చాలా మంది లవర్స్ డే రోజు భయటకు కూడా రావడం లేదు. చాలా ప్రాంతాల్లో శుక్రవారం పార్క్ లు, రెస్టారెంట్లు బోసిపోయాయి. అయితే.. అక్కడక్కడ మాత్రం  ప్రేమ జంటలు తళుక్కుమన్నాయి. అలా వెళ్లిన కొందరు అడ్డంగా ఓ హిందుత్వ సంఘాలకు దొరికిపోయింది. ఈ సంఘటన జార్ఖండ్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... మోరహాబాదీలో గల ఆక్సిజన్ పార్కులో కొంత మంది యువకులు ఒక ప్రేమ జంటకు బలవంతంగా వివాహం జరిపించారు. వివరాల్లోకి వెళితే ప్రేమికుల రోజున పలు ప్రేమ జంటలు పార్కులో విహరిస్తుండగా, ఓ సంఘానికి చెందిన కొందరు యువకులు అక్కడకు వచ్చారు. వాళ్లంతా ప్రేమికుల దినోత్సవానికి వ్యతిరేకిస్తూ.. అక్కడకు వచ్చారు. 

Also Read వాలంటైన్స్ డే రోజు విచిత్రం... ప్రేమ పెళ్లి చేసుకోమంటూ అమ్మాయిలంతా...

 వారిని చూసిన కొన్ని ప్రేమజంటలు అక్కడి నుంచి పారిపోయాయి. అయితే ఆ యవకులు ఒక ప్రేమజంటను మాత్రం పట్టుకున్నారు. వారిని చూసి భయపడిన ఆ యువకుడు ఆమె తన భార్య అని చెప్పాడు. దీంతో ఆ యువకులు తమ దగ్గరున్నకుంకుమను ఆ యువకునికి ఇచ్చి, ఆ యువతి నుదుటన పెట్టమని ఆదేశించారు.

 దీంతో ఆ యువకుడు తప్పించుకునే మార్గం లేక ఆ యువతి నుదుట కుంకుమ పెట్టాడు. తరువాత ఆ యువకులు... ఆ యువకునితో యువతి ఇంటిలోని వారికి ఫోన్ చేసి ఈ విషయం చెప్పమన్నారు. అయితే ఇంతలోనే సీఆర్‌పీఎఫ్ జవాను అక్కడికి వచ్చారు. జవానును చూసి ఆ  హిందూ సంఘానికి చెందిన యువకులంతా అక్కడి నుంచి పారిపోయారు. కాగా ఈ విషయమై పోలీస్ స్టేషన్‌లో ఎటువంటి కేసు నమోదు కాలేదు.