కొత్త ట్రాఫిక్ చట్టం అమలులోకి వచ్చిన దగ్గర నుంచి ప్రయాణికులకు చుక్కలు కనపడుతున్నాయి. ఏ చిన్న తప్పు చేసినా భారీ జరిమానా తప్పడం లేదు.  ఎంత గుర్తు పెట్టుకొని అన్ని పేపర్లు బండిలో పెట్టుకుందామని అనుకుంటున్నప్పటికీ...కొందరు ప్రయాణికులు పొరపాటున కొన్నింటిని మర్చిపోతున్నారు. ఈ క్రమంలో భారీ జరిమానాను ఎదుర్కోవాల్సి వస్తోంది. అయితే... ఈ జరిమానాల బాధ నుంచి తప్పించుకునేందుకు ఓ ప్రయాణికుడు చేసిన ప్రయత్నం నెట్టింట వైరల్ గా మారింది. బెస్ట్ ఐడియా బాస్ అంటూ కొందరు అతనికి మద్దతు పలుకుతున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే... గుజరాత్ రాష్ట్రం వడోదర ప్రాంతానికి చెందిన రామ్ షా అనే వ్యక్తి .. ట్రాఫిక్ జరిమానాల నుంచి తప్పించుకునేందుకు చాలా తెలివిగా ఆలోచించాడు. అతను ఓ ఎల్ఐసీ ఏజెంట్. వృత్తిరిత్యా నిత్యం  వాహనంపై తిరగాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ట్రాఫిక్ పోలీసులకు దొరకకుండా ఉండేందుకు అతను జాగ్రత్తలు తీసుకున్నాడు.  తన బైక్ ఆర్సీ, లైసెన్స్, బీమా వంటి ధ్రువ పత్రాలను హెల్మెట్ కి ప్లాస్టర్ తో అంటించాడు.

అతనిని ప్రత్యేకంగా ట్రాఫిక్ పోలీసులు వాటి గురించి అడగాల్సిన పనిలేకుండా... తన హెల్మెట్ తోనే చూపిస్తున్నాడనమాట. దీంతో అతని తెలివికి ట్రాఫిక్ పోలీసులకు కూడా ఫిదా అయ్యారు. ఇప్పుడు అతని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇదిలా ఉంటే... కేంద్రం విధించిన ఈ భారీ జరిమానాల నుంచి గుజరాత్ రాష్ట్ర ప్రజలకు కొంతమేర ఉపశమనం కలిగించారు. ప్రస్తుతం అమలులో ఉన్న జరిమానాలను సగానికి కుదించారు. మిగిలిన రాష్ట్రాల్లో మాత్రం యాథావిధిగా కొనసాగుతుండటం గమనార్హం.