ఉత్తరాఖండ్ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ : చివరి దశకు చేరుకున్న మిషన్.. ఒక్కొక్కరిగా బయటకొస్తున్న కార్మికులు
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీ సమీపంలోని సిల్‌క్యారా సొరంగం లోపల చిక్కుకుపోయిన 41 మంది కార్మికులను రక్షించేందుకు నిర్వహించిన రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ అయినట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. మొత్తం 41 మందిని తీసుకొచ్చేందుకు 3 నుంచి 4 గంటల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీ సమీపంలోని సిల్‌క్యారా సొరంగం లోపల చిక్కుకుపోయిన 41 మంది కార్మికులను రక్షించేందుకు నిర్వహించిన రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ అయినట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. నేలకు సమాంతరంగా చేపట్టిన పనులు నిలిచిపోయిన చోట నుంచి 12 మంది ర్యాట్ హోల్ మైనర్లు డ్రిల్లింగ్ చేపట్టి మిగిలిన దూరాన్ని పూర్తి చేసి, కార్మికులు చిక్కుకుపోయిన ప్రాంతం వరకు గొట్టాన్ని పంపారు. కాసేపట్లో వీరందరినీ బయటకు తీసుకురానున్నారు. దీంతో అక్కడ ఉద్విగ్న వాతావరణం నెలకొంది. కార్మికుల కుటుంబ సభ్యులు, అధికార యంత్రాంగంతో పాటు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ కూడా స్వయంగా ఆ ప్రాంతానికి చేరుకున్నారు.
బయటికి వచ్చిన కార్మికులను తక్షణం ఆసుపత్రులకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అలాగే అత్యవసర వైద్యం అందించేందుకు నిపుణులైన డాక్టర్లు కూడా టన్నెల్ వద్దకు చేరుకున్నారు. అవసరమైన అంబులెన్స్‌లు, మందులు సిద్ధం చేశారు. సొరంగం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో వున్న చిన్యాలిసౌర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు కార్మికులను తరలించేందుకు గాను పోలీసులు గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేశారు.
పైపు గుండా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది లోపలికి వెళ్లి ఒక్కో కార్మికుడిని బయటకు తీసుకొస్తారని సమాచారం. ఒక్కోక్కరిని తీసుకొచ్చేందుకు కనీసం 3 నుంచి 5 నిమిషాల సమయం పడుతుందని.. మొత్తం 41 మందిని తీసుకొచ్చేందుకు 3 నుంచి 4 గంటల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. అత్యవసర పరిస్ధితుల్లో వున్న వారిని వాయు మార్గంలో తరలించేందుకు చినూక్ హెలికాఫ్టర్లను కూడా ప్రభుత్వం సిద్ధం చేసింది. ప్రస్తుతానికి ముగ్గురు కార్మికులను విజయవంతంగా బయటకు తీసుకొచ్చినట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.