ఉత్తరాఖండ్ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ : ఫలించిన శ్రమ.. 17 రోజుల తర్వాత బాహ్య ప్రపంచంలోకి కార్మికులు
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీ సమీపంలోని సిల్‌క్యారా సొరంగం లోపల చిక్కుకుపోయిన 41 మంది కార్మికులను రక్షించేందుకు నిర్వహించిన రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. వీరందరినీ ఒక్కొక్కరిగా మొత్తం 41 మందిని బయటకు తీసుకొచ్చారు.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీ సమీపంలోని సిల్‌క్యారా సొరంగం లోపల చిక్కుకుపోయిన 41 మంది కార్మికులను రక్షించేందుకు నిర్వహించిన రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. నేలకు సమాంతరంగా చేపట్టిన పనులు నిలిచిపోయిన చోట నుంచి 12 మంది ర్యాట్ హోల్ మైనర్లు డ్రిల్లింగ్ చేపట్టి మిగిలిన దూరాన్ని పూర్తి చేసి, కార్మికులు చిక్కుకుపోయిన ప్రాంతం వరకు గొట్టాన్ని పంపారు. వీరందరినీ ఒక్కొక్కరిగా మొత్తం 41 మందిని బయటకు తీసుకొచ్చారు. దీంతో అక్కడ ఉద్విగ్న వాతావరణం నెలకొంది. కార్మికుల కుటుంబ సభ్యులు, అధికార యంత్రాంగంతో పాటు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ కూడా స్వయంగా ఆ ప్రాంతానికి చేరుకున్నారు.
బయటికి వచ్చిన కార్మికులను తక్షణం ఆసుపత్రులకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అలాగే అత్యవసర వైద్యం అందించేందుకు నిపుణులైన డాక్టర్లు కూడా టన్నెల్ వద్దకు చేరుకున్నారు. అవసరమైన అంబులెన్స్‌లు, మందులు సిద్ధం చేశారు. సొరంగం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో వున్న చిన్యాలిసౌర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు కార్మికులను తరలించేందుకు గాను పోలీసులు గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేశారు. పైపు గుండా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది లోపలికి వెళ్లి ఒక్కో కార్మికుడిని బయటకు తీసుకొచ్చారు. అత్యవసర పరిస్ధితుల్లో వున్న వారిని వాయు మార్గంలో తరలించేందుకు చినూక్ హెలికాఫ్టర్లను కూడా ప్రభుత్వం సిద్ధం చేసింది.
నవంబర్ 12న పనులు చేస్తుండగా.. సొరంగంలో ప్రమాదవశాత్తూ చిక్కుకుపోయారు. దీంతో వీరిని రక్షించేందుకు అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. వారికి నీరు, ఆహారం, ఔషధాలు వంటివి బయటి నుంచే అందించింది. అయితే సహాయక చర్యల సమయంలో వీరికి అనేక సవాళ్లు ఎదురయ్యాయి. ప్రతికూల వాతావరణంతో పాటు ఇతర సాంకేతిక సమస్యలను అధిగమించి కార్మికులను బయటకు తీసుకొచ్చారు. ఆగర్ యంత్రాన్ని రంగంలోకి దింపగా.. ఈ మిషన్ 47 మీటర్లు తవ్విన తర్వాత లోపలికి వెళ్తుండగా దాని బ్లేడ్లు విరిగిపోయాయి. అయినప్పటికీ నిరుత్సాహ పడకుండా ర్యాట్ హోల్ మైనింగ్‌లో నిపుణులైన 12 మందిని రంగంలోకి దించి కార్మికులు వున్న ప్రాంతానికి చేరుకోగలిగారు.