అక్రమ మదర్సా కూల్చివేత : ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో అల్లర్లు, కనిపిస్తే కాల్చేయండి .. సీఎం ఆదేశాలు
గురువారం ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో అక్రమంగా నిర్మించిన మదర్సాను అధికారులు ధ్వంసం చేయడం ఉద్రిక్తతలకు దారి తీసింది. అల్లర్ల దృష్ట్యా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ హల్ద్వానీలోని బంభూల్‌పురా ప్రాంతంలో షూట్ ఎట్ సైట్ (కనిపిస్తే కాల్చివేత) ఉత్తర్వులు జారీ చేశారు.
గురువారం ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో అక్రమంగా నిర్మించిన మదర్సాను అధికారులు ధ్వంసం చేయడం ఉద్రిక్తతలకు దారి తీసింది. దుండగులు పోలీస్ అధికారులపై రాళ్లు రువ్వడంతో ఘర్షణలు చెలరేగాయి. అల్లరి మూక పోలీస్ వాహనాలు సహా ప్రైవేట్ వ్యక్తుల వాహనాలకు నిప్పు పెట్టింది. అల్లర్ల దృష్ట్యా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ అప్రమత్తమయ్యారు. హల్ద్వానీలోని బంభూల్‌పురా ప్రాంతంలో షూట్ ఎట్ సైట్ (కనిపిస్తే కాల్చివేత) ఉత్తర్వులు జారీ చేశారు.
హల్ద్వానీ మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు గురువారం బంభూల్‌పురా పోలీస్ స్టేషన్ సమీపంలో అక్రమంగా నిర్మించిన మదర్సాను కూల్చివేశారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కొందరు వ్యక్తులు పోలీస్ అధికారులపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో పలువురు అధికారులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ ప్రాంతంలో పోలీస్ వాహనాలతో సహా పలు వాహనాలను ధ్వంసం చేసి తగులబెట్టారు. ఓ ట్రాన్స్‌ఫార్మర్‌కు కూడా అల్లరి మూక నిప్పుపెట్టడంతో సమీప ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
మరోవైపు.. బంభూల్‌పురా పోలీస్ స్టేషన్‌ను ఆందోళనకారులు చుట్టుముట్టడంతో పలువురు జర్నలిస్టులు, అధికారులు లోపల చిక్కుకుపోయారు. పరిస్ధితి తీవ్రతరం కావడంతో అదనపు బలగాలను హల్ద్వానీకి రప్పించారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ.. సీఎస్, డీజీపీలతో అత్యవసరంగా సమావేశమయ్యారు. ఆ వెంటనే బంభూల్‌పురాలో కర్ఫ్యూ విధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.