Uttarakhand: ఉత్తరాఖండ్ లోని చంపావత్ ఉప ఎన్నికలో సీఎం పుష్కర్ సింగ్ ధామి ఘన విజయం సాధించారు. ఉప ఎన్నికలో తన సమీప ప్రత్యర్థి పై 58 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ సందర్భంగా...ధామికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు.
Uttarakhand: ఉత్తరాఖండ్ ఉప ఎన్నికలో సీఎం పుష్కర్ సింగ్ ధామి ఘన విజయం సాధించారు. ఉప ఎన్నికలో 58 వేలకు పైగా ఓట్ల తేడాతో సీఎం ధామి విజయం సాధించి సరికొత్త రికార్డు సృష్టించారు. దీంతో ఆయన తన సీఎం స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికల్లో ఖటిమా నియోజకవర్గం నుంచి పరాజయం పాలైన విషయం తెలిసిందే. చంపావత్‌లో కాంగ్రెస్‌కు చెందిన నిర్మలా గహ్తోరిపై 58 వేల ఓట్ల తేడాతో సీఎం ధామి విజయం సాధించారని ఎన్నికల అధికారులు తెలిపారు. సీఎం ధామి రికార్డు ఓట్ల తేడాతో గెలుపొందడంతో బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. తొలిసారి కాంగ్రెస్ తన డిపాజిట్ ను కోల్పోయింది.
చంపావత్ ప్రజలకు సీఎం ధామి ధన్యవాదాలు
చంపావత్ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించినందుకు ఉత్తరాఖండ్ ప్రజలకు ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కృతజ్ఞతలు తెలిపారు.తన లాంటి సామాన్య కార్యకర్తను సీఎంగా గెలిపించడం చాలా సంతోషంగా ఉందనీ, ఇది ప్రజల నమ్మకానికి దక్కిన విజయమనీ, ఈ విజయం ఉత్తరాఖండ్ ప్రజలకు విజయంగా అభివర్ణించారు.
ప్రధాని మోదీ, సీఎం యోగి అభినందనలు
చంపావత్ ఉప ఎన్నికలో 58 వేలకు పైగా ఓట్లతో విజయం సాధించి సరికొత్త రికార్డు సృష్టించారు. ఉప ఎన్నికల్లో విజయం సాధించిన సీఎం పుష్కర్ సింగ్ ధామికి ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అభినందనలు తెలిపారు.
చంపావత్ నుంచి రికార్డు విజయం సాధించినందుకు ఉత్తరాఖండ్ డైనమిక్ ముఖ్యమంత్రికి అభినందనలు అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఉత్తరాఖండ్ పురోగతికి ఆయన మరింత కృషి చేస్తారని నమ్ముతున్నాననీ, బీజేపీపై విశ్వాసం ఉంచినందుకు చంపావత్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయానికి కృషి చేసిన కార్యకర్తలను అభినందించారు.
మరోవైపు, చంపావత్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించినందుకు దేవభూమి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రికి హృదయపూర్వక అభినందనలు అని సీఎం యోగి ఆదిత్యనాథ్ ట్వీట్ చేశారు. ఈ విజయం గౌరవనీయులైన ప్రధానమంత్రి ప్రజా సంక్షేమ విధానాలకు, మీ అభివృద్ధి నాయకత్వానికి, బిజెపి కార్యకర్తల కృషికి అంకితమని తెలిపారు.
ఉప ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామికి ఉత్తరాఖండ్ అసెంబ్లీ స్పీకర్ రీతూ ఖండూరి భూషణ్ అభినందనలు తెలిపారు. ప్రజల ప్రేమ, విశ్వాసం, ఆశీస్సులకు ఇది చారిత్రాత్మక విజయమని స్పీకర్ అన్నారు. ధామి వికాస్ యాత్రను కొనసాగించడం ద్వారా ఉత్తరాఖండ్ ప్రజల ఆకాంక్షలను ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ నెరవేరుస్తారని స్పీకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల విశ్వాసం మేరకు రాష్ట్రానికి కొత్త దిశానిర్దేశం చేస్తూ ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తామని అన్నారు.
