ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ మానవ పరిణామ క్రమంలో ఒక కొత్త అర్ధాన్ని ఇచ్చారు. సాధారణంగా ఈ భూగోళం మీద జీవించే అన్ని ప్రాణులు ఆక్సిజన్‌ను పీల్చి.. కార్బన్ డై ఆక్సైడ్‌ను విడుదల చేస్తాయి.. కానీ ఈ ప్రపంచంలో ఆవు ఒక్కటే... ఆక్సిజన్‌ను పీల్చి.. ఆక్సిజన్‌నే విడుదల చేస్తుందని త్రివేంద్ర సింగ్ వింత వాదనను లేవనెత్తారు.

డెహ్రాడూన్‌లో ఓ సదస్సుకు హాజరైన ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఆవుకు మసాజ్ చేయడం వల్ల శ్వాస సంబంధమైన వ్యాధులు కూడా నయమవుతాయన్నారు. ఆవు చావిట్లోనే ఎక్కువ కాలం గడపటం వల్ల టీబీ సైతం మాయమవుతుందని త్రివేంద్రసింగ్ వ్యాఖ్యానించారు.

గోవుల నుంచే తమకు ఆక్సిజన్ అందుతోందనే విషయాన్ని ఉత్తరాఖండ్‌లోని పహాడీ ఇలాకాలో నివసించే ప్రజలు ఇప్పటికీ విశ్వసిస్తున్నారని సీఎం అన్నారు. గోవు మూత్రం, పాలు ఎంత శ్రేష్టమైనవో అది విడుదల చేసే వాయువు సైతం అంతే శ్రేష్టమైనదన్నారు.

కొద్దిరోజుల క్రితం ఉత్తరాఖండ్‌కే చెందిన బీజేపీ ఎమ్మెల్యే అజయ్ భట్ .. గర్భిణులు డెలీవరి సమయంలో గరుడ్ గంగా జలాన్ని తాగడం వల్ల సిజేరియన్లను నివారించవచ్చని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.