ఈ మధ్యకాలంలో టోర్న్ జీన్స్ ఎంత గా పాపులరిటీ సంపాదించుకున్నాయో అందరికీ తెలిసిందే. అమ్మాయిలు, అబ్బాయిలు అనే తేడా లేకుండా అందరూ ఈ జీన్స్ వేసుకుంటున్నారు. కాగా.. ఈ జీన్స్ అమ్మాయిలు వేసుకోవద్దంటూ ఇటీవల ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి.  అయితే.. అందరూ ఆయన చేసిన కామెంట్స్ పై మండిపడటంతో ఆయన కాస్త వెనక్కి తగ్గారు. 

తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించాలని ఆయన కోరారు. అయితే.. క్షమాపణ చెప్పిన తర్వాత కూడా ఆయన మళ్లీ అదే తరహా వ్యాఖ్యలు చేశారు. జీన్స్ ధరించడం పట్ల తనకు ఎలాంటి అభ్యంతరం లేదని.. కానీ చిరిగిన జీన్స్ ధరించడం మాత్రం సమంజసం కాదని ఆయన వ్యాఖ్యానించారు. 

ఈరోజుల్లో పిల్లలు ఖరీదైన జీన్స్‌ను కొని ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఆ ప్యాంట్‌ను కత్తెరతో కట్ చేస్తున్నారని తీరత్ చెప్పారు. తాను ఇళ్లలో ఉండే వాతావరణం గురించి మాత్రమే మాట్లాడానని.. మంచి విలువలు, క్రమశిక్షణతో పెరిగిన చిన్నారులు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరని ఆయన చెప్పుకొచ్చారు.

తాను గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాడినని, స్కూల్లో చదువుకునే రోజుల్లో తన ప్యాంట్ చిరిగి ఉండేదని.. టీచర్ తిడతారేమోనని చాలా భయపడేవాడినని ఆయన చెప్పుకొచ్చారు. ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన తీరత్ సింగ్ రావత్ మహిళల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలపై యువత భగ్గుమంటోంది. ఓ ఎన్జీవోను నడిపిస్తున్న యువతి చిరిగిన జీన్స్ వేసుకోవడం చూసి షాకయ్యానని, ఆ వేషధారణతో ఎన్జీవో విషయమై ప్రజలను కలవడానికి వెళితే.. సమాజానికి ఏం సంకేతాలిస్తున్నారని ఆయన చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి.