ఉత్తరాఖండ్ ద్వారహత్ నియోజకవర్గ ‌బీజేపీ ఎమ్మెల్యే మహేష్ నేగిపై గత కొంతకాలంగా అత్యాచార ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. ఇటీవల పోలీసులు ఆయనపై ఐపీసీ 376 (అత్యాచారం), 506 (క్రిమినల్ బెదిరింపు) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

 గత నెల 16న ఓ మహిళ ఎమ్మెల్యే మహేష్ నేగితో తనకు రెండేళ్లుగా శారీరక సంబంధం ఉందని వీడియో విడుదల చేసి పోలీసులను ఆశ్రయించింది. తన కూతురు డీఎన్‌ఐ భర్త డీఎన్‌ఏతో సరిపోలడం లేదని, ఆమెకు తండ్రి ఎమ్మెల్యే నేగీయేనని ఆరోపించింది. వెంటనే డీఎన్‌ఏ పరీక్ష చేయించాలని బాధితురాలు డిమాండ్‌ చేసిన సంగతి తెలిసిందే.

కాగా.. తనను కేసు వెనక్కి తీసుకోవాలని.. అందుకు డబ్బులు కూడా ఇస్తామంటూ ఎమ్మెల్యే బెదిరిస్తున్నాడని బాధితురాలు వాపోయింది. కేసు సెటిల్మెంట్ కోసం ఒత్తిడి చేస్తున్నట్లు బాధితురాలు చెబుతోంది. ఈ విషయంపై డెహ్రాడూన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి విచారణ జరిపారు. కేసు నుంచి బయట పడేందుకు బాధితురాలికి ఎమ్మెల్యే నేగీ, అతడి భార్య డబ్బు ఇచ్చేందుకు యత్నించారని విచారణలో తేలడంతో ఎమ్మెల్యే నేగి, అతని భార్య రీటా నేగిపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. 

ఈ మేరకు పోలీసులు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు. కాగా తన పరువు తీసేందుకే కొంతమంది కాంగ్రెస్‌ నాయకులు కుట్ర పూరితంగా తనను ఈ కేసులో ఇరికించారని నేగి ఆరోపించారు. ఎలాంటి దర్యాప్తు కైనా సిద్ధంగా ఉన్నానని అన్నారు. గతంలోనూ సదరు మహిళ పలువురిపై తప్పుడు కేసులు బనాయించి బెదిరింపులకు పాల్పడినట్లు తన వద్ద ఆధారాలున్నాయని చెప్పారు. త్వరలో వాటిని పోలీసులకు సమర్పించనున్నట్లు తెలిపారు. తన నుంచి తీసుకున్న రూ. 5 కోట్లు తిరిగి ఇవ్వకుండా ఈ విధంగా బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్నట్లు ఆయన ఆక్షేపించారు.