భర్త ఆత్మహత్య చేసుకోని ప్రాణాలు కోల్పోయాడు.  ఆ వార్త విని భార్య కూడా తట్టుకోలేకపోయింది. భర్త చనిపోయిన 24 గంటల్లో ఆమె కూడా బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసిలోని శివపురి పరిధికి చెందిన కిరణ్(25) అనే యువతికి నాలుగేళ్ల క్రితం అఖిలేష్ (29) అనే యువకుడితో వివాహమైంది. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కాగా.. ఇటీవల అఖిలేష్ బలియా పరిధిలోని చిత్‌బడ్‌గావ్‌లో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా కిరణ్ కూడా ఓవర్‌బ్రిడ్జి నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించింది. 

ధైర్యం సరిపోకపోవడంతో ట్రక్‌కు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ దంపతులు తొలుత ఢిల్లీ, తరువాత శివపుర్‌లోని తరానాలో వచ్చి ఉండసాగారు. కాగా అఖిలష్ డైరీలో సూసైడ్ నోట్ లభించింది. తన ఆత్మహత్యకు ఎవరూ కారకులు కాదని దానిలో అఖిలేష్ పేర్కొన్నాడు. అఖిలేష్ ప్రేమ వివాహం చేసుకున్నదగ్గర నుంచి తన కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. దీంతో మానసిక వేదన అనుభవించేవాడని తెలుస్తోంది. అదేవిధంగా కిరణ్ కూడా తన ఇంట్లోని వారితో తెగతెంపులు చేసుకుని అఖిలేష్ దగ్గరకు వచ్చేసింది. అప్పటి నుంచి ఇద్దరూ తమ కుటుంబ సభ్యులకు దూరంగా ఢిల్లీలో ఉన్నారు. ఇంట్లోని వారికి దూరమయ్యామనే వ్యథతోనే వారు ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.