కేసీఆర్ చేసినపనే యోగి కూడా చేసారు ... జాతీయ అవార్డు పట్టేసారు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం జల నిర్వహణ, సంరక్షణలో అద్భుతంగా పనిచేసి జాతీయ స్థాయిలో అవార్డు అందుకుంది. ఉత్తమ రాష్ట్ర విభాగంలో రెండో స్థానం, బాందా జిల్లాకు మొదటి స్థానం లభించాయి.

Uttar Pradesh Wins National Water Award for Outstanding Water Management AKP

లక్నో : సీఎం యోగీ ఆదిత్యనాథ్ నాయకత్వంలో జల నిర్వహణ, సంరక్షణలో అద్భుతంగా పనిచేసినందుకు ఉత్తరప్రదేశ్ కు జాతీయ జల అవార్డు లభించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ నల్లా నీటి సౌకర్యం కల్పించడంతో పాటు జల సంరక్షణ, నిర్వహణలో అద్భుతంగా పనిచేసినందుకు ఉత్తమ రాష్ట్ర విభాగంలో దేశంలోనే రెండో స్థానం దక్కింది.

ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగిన ఐదవ జాతీయ జల అవార్డుల ప్రధానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డును అందజేశారు. నమామి గంగే, గ్రామీణ జల సరఫరా విభాగం అదనపు ప్రధాన కార్యదర్శి అనురాగ్ శ్రీవాస్తవ, గృహనిర్మాణ కమిషనర్ డాక్టర్ బల్కార్ సింగ్ అవార్డును స్వీకరించారు. ఉత్తమ రాష్ట్ర విభాగంలో ఒడిశాకు మొదటి స్థానం, గుజరాత్, పుదుచ్చేరికి సంయుక్తంగా మూడో స్థానం లభించింది.

రాష్ట్రపతి ప్రశంస

ఉత్తరప్రదేశ్ లో ఇంటింటికీ నల్లా నీటి సౌకర్యం కల్పించడం, జల సంరక్షణలో చేపట్టిన కార్యక్రమాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసించారు. కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ కూడా బుందేల్ ఖండ్, వింద్య ప్రాంతాల్లో ఇంటింటికీ నల్లా నీటి సౌకర్యం, జల సంరక్షణలో యూపీ చేపట్టిన కార్యక్రమాలను ప్రశంసించారు.

జల సంరక్షణ, నిర్వహణతో పాటు 2023లో 17,900 గ్రామాలకు అతి త్వరగా ఇంటింటికీ నల్లా నీటి సౌకర్యం కల్పించి యూపీ రికార్డు సృష్టించింది. యోగీ ప్రభుత్వ ఆదేశాలతో 2023లో డైరెక్టర్ గ్రౌండ్ వాటర్, నమామి గంగే కార్యదర్శిగా ఉన్న డాక్టర్ బల్కార్ సింగ్ జల సంరక్షణ, నిర్వహణలో అనేక కార్యక్రమాలు చేపట్టారు. దీనివల్ల జల నిర్వహణతో పాటు రైతులకు సాగునీటి వసతి కూడా మెరుగైంది.

రాష్ట్రంలో సాగునీటి వసతి మెరుగుపరచడానికి 6000కు పైగా చెక్ డ్యామ్ లు, 1000 చెరువులను యోగి సర్కార్ నిర్మించింది. 31360 ప్రభుత్వ భవనాల్లో వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. 2022-23లో ఐదు బ్లాకులను అతి తక్కువ నీటి వనరులున్న, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న జాబితా నుంచి తొలగించారు. 34 నగరాల్లో భూగర్భ జలమట్టం పెరిగింది. 27,368 సాంప్రదాయ నీటి వనరులను పునరుద్ధరించారు. 17279 అమృత్ సరోవర్ లను నిర్మించారు.  

2.27 కోట్లకు పైగా ఇళ్లకు నల్లా నీటి సౌకర్యం

యోగీ ఆదిత్యనాథ్ మార్గదర్శకత్వంలో జల జీవన్ మిషన్ కింద అక్టోబర్ 22, 2024 నాటికి 2 కోట్ల 27 లక్షల 77 వేల 194 గ్రామీణ కుటుంబాలకు నల్లా నీటి సౌకర్యం కల్పించారు. దీనివల్ల 13.66 కోట్ల మంది గ్రామీణులకు శుద్ధి చేసిన తాగునీరు అందుతోంది. ఇటీవలే రాష్ట్ర స్వచ్ఛతా, తాగునీటి మిషన్ కు అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనలో ఉత్తమ ప్రదర్శన అవార్డు లభించింది.

దేశవ్యాప్తంగా జల సంరక్షణలో జిల్లా విభాగంలో బాందాకు మొదటి స్థానం లభించింది. బాందా అప్పటి జిల్లా కలెక్టర్ (ప్రస్తుతం లఖింపూర్ ఖేరీ కలెక్టర్) దుర్గాశక్తి నాగ్ పాల్ రాష్ట్రపతి నుంచి అవార్డును స్వీకరించారు. జల సంరక్షణ, ఇంటింటికీ నల్లా నీటి సౌకర్యం కల్పించడంలో ఆమె అద్భుతంగా పనిచేశారు. 

యూపీకి అవార్డులపై యోగి కామెంట్స్ :

ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ తన సోషల్ మీడియాలో యూపీకి దక్కిన అవార్డులపై స్పందించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఐదవ జాతీయ జల అవార్డుల్లో ఉత్తమ రాష్ట్ర విభాగంలో యూపీకి రెండో స్థానం, బాందా జిల్లాకు ఉత్తమ జిల్లా అవార్డు అందజేశారని పేర్కొన్నారు. ప్రధాని మోదీ మార్గదర్శకత్వంలో యూపీలో జలశక్తి పథకంలో అనేక అద్భుతమైన పనులు జరుగుతున్నాయని.. జల సంరక్షణ, నిర్వహణ, ప్రజా భాగస్వామ్యానికి ప్రాధాన్యం ఇవ్వడం వల్లే ఈ అవార్డు లభించిందని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు, జల సంరక్షణలో పనిచేస్తున్న వారందరికీ అభినందనలు తెలిపారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios