Asianet News TeluguAsianet News Telugu

Girl Students: బ‌దిలీ కోపంతో.. బాలిక‌ల‌ను బంధించిన టీచ‌ర్లు !

Lakhimpur Kheri: క‌స్తూర్బా గాంధీ బాలికా విద్యాల‌య స్కూల్‌కు చెందిన అమ్మాయిల్ని స్కూల్ పైక‌ప్పు బాల్కానీ ప్రాంతంలో బయటకు రాకుండా బంధించారు ఇద్దరు టీచర్లు. తమ బదిలీ విషయంలో జిల్లా అధికారుల‌పై వ‌త్తిడి తెచ్చేందుకు ఇద్ద‌రు టీచ‌ర్లు ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డ్డారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో సంఘ‌ట‌న చోటుచేసుకుంది. 
 

Uttar Pradesh: Upset Over Transfer, 2 Teachers Lock Up Girl Students On UP School Roof
Author
Hyderabad, First Published Apr 23, 2022, 10:41 AM IST

Uttar Pradesh: వేరే ప్రాంతానికి బదిలీ చేశార‌న్న కోపంతో ఇద్ద‌రు టీచ‌ర్లు ఏకంగా 24 మంది విద్యార్థినులను స్కూల్ పైక‌ప్పు పై ఉన్న బాల్కానీ ప్రాంతంలో బంధించారు. అర్థ‌రాత్రి వ‌ర‌కు బాలిక‌లు అక్క‌డే ఉండిపోవాల్సిన ప‌రిస్థితి కొన‌సాగింది. అయితే, స‌మాచారం అందుకున్న పోలీసులు.. రంగంలోకి దిగి బాలిక‌ల‌ను సుర‌క్షితంగా హాస్ట‌ల్ కు తీసుకువ‌చ్చారు. విచార‌ణ‌కు దిగిన ఆధికార యంత్రాంగం ఆ ఉపాధ్యాయుల‌పై చ‌ర్య‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ షాకింగ్ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో చోటుచేసుకుంది. 

వివ‌రాల్లోకెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరికి చెందిన ఇద్దరు ఉపాధ్యాయులు తమ బదిలీ ఉత్తర్వుల నేప‌థ్యంలో వ‌చ్చిన కోపాన్ని విద్యార్థుల‌పై చూపించారు. బాలిక‌ల‌ను అర్థ‌రాత్రి వ‌ర‌కు పైక‌ప్పు బాల్కానీలో బంధించారు.  ఈ ఘ‌ట‌న యూపీలోని ల‌ఖింపురి ఖేరి జిల్లాలో జ‌రిగింది. త‌మ బ‌దిలీ ఉత్త‌ర్వుల‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తమ పాఠశాల విద్యార్థినులను బాల్కనీలో బంధించి.. అధికారుల‌పై ఒత్తిడి తెచ్చేందుకు ప్ర‌య‌త్నించారు. ఈ ఘటన గత గురువారం చోటుచేసుకుంది. చాలాసేపు ఆ పైగ‌దుల్లోనే  విద్యార్థులు బందీలుగా మారి తీవ్ర ఇబ్బందులు ప‌డ్డారు. మ‌రోవైపు విద్యార్థినీలు హాస్ట‌ల్ తిరిగి రాక‌పోవ‌డంతో అక్క‌డి సిబ్బంది పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. స‌మాచారం అందుకున్న పోలీసులు బంధించబ‌డిన బాలిక‌ల‌ను సుర‌క్షితంగా హాస్టల్‌కు చేర్చారు. 

లఖింపూర్ ఖేరి జిల్లాలోని బెహ్జామ్‌లోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలోని దాదాపు 24 మంది విద్యార్థులను ఇద్దరు ఉపాధ్యాయులు తమ బదిలీ ఉత్తర్వులను రద్దు చేయాలని జిల్లా అధికారులపై ఒత్తిడి తెచ్చేందుకు పాఠశాల పైకప్పు బాల్కానీ ప్రాంతంలో బందించి.. వారు బ‌య‌ట‌కు రాకుండా తాళం వేసినట్లు అధికారులు ఈ విష‌యాన్ని శుక్రవారం నాడు వెల్ల‌డించారు. ఈ ఘ‌ట‌న‌పై లఖింపూర్ ఖేరిలోని విద్యాశాఖ అధికారి లక్ష్మీకాంత్ పాండే మాట్లాడుతూ.. ఇద్దరు ఉపాధ్యాయులు తమకు అందిన బ‌దిలీ ఉత్త‌ర్వుల‌ను ర‌ద్దు చేయాల‌ని నిరసిస్తూఈ  సంఘటనకు పాల్ప‌డ్డార‌ని తెలిపారు. వీరిద్దరిపై ఇప్పటికే పలు ఫిర్యాదులు రావడంతో క్రమశిక్షణా చర్యల్లో భాగంగానే బదిలీ చేశామ‌ని తెలిపారు. ఇద్దరినీ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో పని చేయాలని ఆదేశించారు. అయితే ఈ ఆర్డర్‌ను రద్దు చేయాలంటూ ఒత్తిడి తెచ్చి.. విద్యార్థుల‌ను బంధించిన ఈ ఇద్ద‌రు ఉపాధ్యాయులు ఈ హేయమైన చర్యకు పాల్పడ్డారని అధికారులు తెలిపారు.

బాలికల‌ను బంధించిన మనోరమా మిశ్రా, గోల్డీ కతియార్ అనే ఈ ఇద్దరు ఉపాధ్యాయులపై ఎఫ్ఐఆర్ న‌మోదుచేశారు పోలీసులు. అలాగే, శాఖాపరమైన విచారణకు విద్యాశాఖ అధికారులు ఆదేశించారు. మూడు రోజుల్లో విచారణ నివేదిక అందిన త‌ర్వాత వారిపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు. ఇక పోలీసులు సైతం కేసు న‌మోదుచేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘ‌ట‌న గురించి మొద‌టగా హాస్టల్ వార్డెన్ లలిత్ కుమారి.. లఖింపూర్ ఖేరి విద్యాశాఖ అధికారి లక్ష్మీకాంత్ పాండే, బాలికా విద్య జిల్లా కోఆర్డినేటర్ రేణు శ్రీవాస్తవ్‌లకు సమాచారం అందించారు. వారు పాఠశాలకు చేరుకుని, కొన్ని గంటలపాటు అక్కడే ఉండి.. పోలీసుల‌తో క‌లిపి బాలిక‌ల‌ను సుర‌క్షితంగా హాస్టల్ కు చేర్చారు. 

కాగా, ఈ ఘ‌ట‌న‌పై ప్ర‌స్తుతం స‌ర్వ‌త్రా ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతున్న‌ది. బాలిక‌ల‌ను బంధించిన ఆ ఇద్ద‌రు ఉపాధ్యాయుల‌ను పూర్తిగా విధుల నుంచి తొల‌గించి.. క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ వినిపిస్తోంది.  
 

Follow Us:
Download App:
  • android
  • ios