కేంద్రంలో అధికార పార్టీ బిజెపికి ఓ మహిళా ఎంపి షాకిచ్చారు. బరేక్ లోక్ సభ స్థానం నుండి ఎంపిగా ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళా ఎంపి సావిత్రిభాయి పూలే సంచలన నిర్ణయం తీసుకున్నారు. అధికార  పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి ఉత్తరప్నదేశ్ రాజకీయాల్లో ప్రకంపణలు సృష్టించారు. యూపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బిజెపి  దళితుల పట్ల వ్యవహరిస్తున్న తీరు బాగోలేదని...అందువల్లే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సావిత్రిభాయి వెల్లడించారు.

యోగి హనుమంతున్ని దళితుడిగా అభివర్ణించడాన్ని సావిత్రిభాయి గుర్తు చేశారు. కేవలం ఇలా ప్రకటన చేయడం తప్ప ఆయన దళితులకు ఏం చేశారని ప్రశ్నించారు. యూపిలో అడుగడుగున దళితులు అవమానాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏనాడైనా ముఖ్యమంత్రి యోగి ఓ దళితున్ని కౌగిలించుకున్నాడా అని సావిత్రిభాయి ప్రశ్నించారు.

హనుమంతుడు ముమ్మాటికి దళితుడేనని ఆమె స్పష్టం చేశారు. అందువల్లే ఆయన్ని కోతిగా పేర్కొంటూ అవమానిస్తున్నారని తెలిపారు. కానీ ఆయన కోతి కాదని మనిషేనని సావిత్రిభాయి స్పష్టం చేశారు. దళితులనే కాదు దళిత దేవుళ్లను కూడా అవమానించడం చూస్తే ప్రస్తుతం వారి పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుందని సావిత్రభాయి ఆవేదన వ్యక్తం చేశారు.