గన్ సరదా ఓ స్నేహితుడి ప్రాణం తీసింది. మద్యం మత్తులో గొప్పలు చెప్పుకోబోయి స్నేహితుడి ప్రాణాలు తీసేశాడు. ఈ ఘటనలో ట్విస్ట్ ఏంటంటే చనిపోయిన వ్యక్తే.. స్వయంగా తన చావును తానే రికార్డ్ చేసుకోవడం.. ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 

సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియో వివరాల్లోకి వెడితే...  ఉత్తర ప్రదేశ్‌ ముజఫర్‌నగర్‌కు చెందిన నిందితుడు, రెండు రోజుల క్రితం తన స్నేహితులతో కలిసి ఊరిబయట పార్టీ చేసుకున్నాడు. మద్యం తాగి ఎంజాయ్ చేశారు. ఈ క్రమంలో తన దగ్గరున్న తుపాకీ పనిచేస్తుందో లేదో చెక్ చేద్దామనుకున్నాడు. 

తుపాకీ తీసి దాంట్లో బుల్లెట్లు లోడ్ చేశాడు. ఈ క్రమాన్నంతా ఓ స్నేహితుడు సరదాగా వీడియో తీస్తున్నాడు. మరో స్నేహితుడికి గన్ ఇవ్వబోగా అతను తీసుకోలేదు. దీంతో అతనే గాల్లోకి కాల్పులు జరిపాడు. అయితే ఆ బుల్లెట్ వెళ్లి వీడియో తీస్తున్న స్నేహితుడికి తగిలింది.

కెమెరా కింద పడేసి అతను గట్టికేకలు పెడుతూ పడిపోయాడు. ఇదంతా వీడియోలో రికార్డయ్యింది. అనుకోని ఈ ఘటనకు నిందితుడు, మరో స్నేహితుడు షాక్ అయ్యారు. వెంటనే అక్కడినుంచి పరారయ్యారు. బుల్లెట్ తగిలిన స్నేహితుడు చనిపోయాడు.

విషయం తెలిసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సరదాగా తుపాకీ పని చేస్తుందా లేదా చెక్ చేద్దామని ట్రై చేశానని, కానీ దురదృష్టవశాత్తు ఆ తూటా తన స్నేహితుడికి తగిలిందని తాను కావాలని ఇలా చేయలేదని వెల్లడించాడు. పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు.